
D Spiritual: Feb 5: నరసరావుపేట: సామాన్య భక్తులకు పెద్దపీట – మంత్రి ఆనం
ఏపీ రాష్ట్రంలోని దేవాలయాల్లో జరిగే ప్రతి పూజా, ప్రతి కైంకర్యంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. త్రికోటేశ్వర స్వామి తిరుణాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ నెల 15న జరగనున్న కోటప్పకొండ తిరుణాళ్ల ఏర్పాట్లపై బుధవారం మంత్రి ఆనం ఆధ్వర్యంలో మూడవ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి తదితర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
తిరుణాళ్లకు రూ.30 లక్షల మంజూరు
ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే కోటప్పకొండ తిరుణాళ్లకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఆనం ప్రకటించారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు క్యూ లైన్లలో మజ్జిగ, మంచినీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు నిలబడకుండా త్వరిత దర్శనం కల్పించాలని, వీఐపీ దర్శన టికెట్లను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వీఐపీలు కేటాయించిన టైం స్లాట్లోనే దర్శనం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు.
ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ
త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 12లోపు తిరుణాళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగుల దర్శనానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులకు తెలిపారు. తిరుణాళ్ల సమయంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
రవాణా, పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు
జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రికి 550 బస్సులు నడిపామని, ఈసారి 618 బస్సులు కేటాయించినట్లు తెలిపారు. కొండపై నుంచి భక్తులను తరలించేందుకు ప్రత్యేకంగా 95 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాత్రి పూట కొండపై ఉండే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రభల సమయంలో వెలుతురు నాణ్యత మెరుగుపరిచామని వివరించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
భద్రత, సమన్వయంపై అధికారుల హామీ
జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ బి. కృష్ణారావు మాట్లాడుతూ సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం సులభంగా లభించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తిరుణాళ్లను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
త్రికోటేశ్వరునికి మంత్రుల ప్రత్యేక పూజలు
ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, దేవస్థానం ధర్మకర్త కొండలరావు బహదూర్, ఆలయ ఈవో డి. చంద్రశేఖరరావు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు త్రికోటేశ్వరుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
