
D Spiritual: Feb 4: సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో ఒకటైన శాంతికళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. 108 దేవదేవేరులకు ఒకేచోట, ఒకే వేదికపై ఏకకాలంలో శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా సాగిన ఈ వేడుక నభూతో న భవిష్యత్‌ను తలపించింది.
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం ఇల వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమేనని భక్తులు పేర్కొన్నారు. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞగా భావిస్తున్నారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి వేలాది మంది భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
శాంతి కల్యాణ మహోత్సవానికి ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించారు. అనంతరం వాసుదేవ పుణ్యాహవచనం జరిపించారు.
108 దివ్యదేశాధీశులు పెళ్లి కొడుకులుగా, దేవేరులు వధువులుగా ముస్తాబయ్యారు. వధూవరుల గోత్ర నామాలతో అర్చకులు ప్రవరానుసంధానం నిర్వహించారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించి, దంపతులకు పట్టు వస్త్రాలను అర్పించారు.
ఆ తర్వాత సువర్ణంతో సమానమైన 16 దానాలు చేశారు. సుముహూర్తం సమయంలో జీలకర్ర, బెల్లం సమర్పించారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు జరిపారు. స్వామి అనుజ్ఞ తీసుకుని అర్చకుడి ద్వారా అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పించారు.
స్వామి అనుజ్ఞతో అర్చకుల ద్వారా దివ్య మంగళసూత్రధారణ, మంగళ అక్షింతల సమర్పణతో శాంతి కల్యాణోత్సవం కనుల పండువగా మారింది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కన్పించని అపూర్వ, అద్వితీయ, సమ్మోహన దృశ్యంగా ఈ శాంతికళ్యాణ మహోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
