DSports 03Feb 2026:దుబాయ్/కొలంబో: భారత్‌తో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అనుసరిస్తున్న ‘మౌన ముద్ర’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించలేక, అలాగని ఐసీసీ నిబంధనల నుండి తప్పించుకోలేక పీసీబీ సతమతమవుతోంది.

  • బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా (భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించిన నేపథ్యంలో) పాకిస్థాన్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే, పీసీబీ ఇప్పటి వరకు దీనిపై ఐసీసీకి ఎటువంటి అధికారిక ఈమెయిల్ లేదా లేఖ పంపకపోవడం గమనార్హం. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం బయటకు రావడంతో, పీసీబీ చివరి నిమిషంలో మనసు మార్చుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను తప్పించుకోవడానికి ‘ఫోర్స్ మేజ్యూర్’ (తమ నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితులు) క్లాజును వాడుకోవాలని చూస్తోంది. కానీ, ఐసీసీ దీనిపై స్పష్టతనిచ్చింది:యుద్ధం లేదా ప్రకృతి విపత్తుల వంటి కారణాలు ఉంటేనే ఈ క్లాజు వర్తిస్తుంది. కేవలం ప్రభుత్వ ఆదేశాల పేరుతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే దానిని ‘ఫెయిల్యూర్ టు ప్లే’ (Failure to Play) గానే పరిగణిస్తారు.పాక్ మైదానంలోకి రాకపోతే భారత్‌కు నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి. అంతేకాకుండా, పాకిస్థాన్ నెట్ రన్ రేట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.టోర్నీ ఒప్పందాలను ఉల్లంఘించినందుకు పీసీబీపై భారీ ఆర్థిక జరిమానాతో పాటు, భవిష్యత్తులో ఐసీసీ నిధుల నిలిపివేత లేదా సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది.