
D Spiritual: Jan 31: తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరల ప్రభావంతో కొండపై శ్రీవారి డాలర్లకు గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికి ఒక్కసారి మాత్రమే ధరలను నిర్ణయిస్తున్న టీటీడీ, మార్కెట్ కంటే తక్కువ ధరలకు బంగారు డాలర్లను విక్రయిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద కౌంటర్‌లో టీటీడీ బంగారు, వెండి డాలర్లను విక్రయిస్తోంది. 10, 5, 2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, అలాగే 50, 10, 5 గ్రాముల వెండి డాలర్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ వారం టీటీడీ నిర్ణయించిన ధరలు మార్కెట్‌లో ఉన్న బంగారు, వెండి ధరలకంటే తక్కువగా ఉండటంతో కొనుగోళ్లకు డిమాండ్ మరింత పెరిగింది.
డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ధరల తేడానే. 10 గ్రాముల 22 క్యారెట్ల శ్రీవారి బంగారు డాలర్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 1,55,855గా నిర్ణయించి విక్రయిస్తోంది. అలాగే 5 గ్రాముల బంగారు డాలర్ ధర రూ. 78,801 కాగా, 2 గ్రాముల బంగారు డాలర్ ధర రూ. 32,429గా నిర్ణయించారు.
మరోవైపు వెండి డాలర్ల ధరలను కూడా టీటీడీ తక్కువగానే నిర్ణయించింది. 50 గ్రాముల శ్రీవారి వెండి ధర రూ. 19,818గా, 10 గ్రాముల వెండి డాలర్ ధర రూ. 4,095గా, 5 గ్రాముల వెండి డాలర్ ధర రూ. 2,127గా నిర్ణయించి భక్తులకు విక్రయిస్తోంది.
ఈ రోజు ఉదయం ఆన్‌లైన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ధర సుమారు రూ. 1,73,400 ఉండటంతో శ్రీవారి డాలర్లకు మరింత గిరాకీ ఏర్పడింది. మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు రూ. 15 వేల వరకు తక్కువ ధరకు శ్రీవారి బంగారు డాలర్ లభిస్తుండటం భక్తులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా కూలీ, తరుగు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా లేకపోవడంతో టీటీడీ విక్రయించే డాలర్లు మరింత చౌకగా మారుతున్నాయి.
టీటీడీ ప్రతి భక్తుడికి ఒక్క డాలర్ మాత్రమే విక్రయిస్తోంది. భక్తుల పేరు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలు తీసుకుని డాలర్లను అందజేస్తోంది. తక్కువ ధరకు శ్రీవారి డాలర్లు లభిస్తున్నందుకు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరోవైపు బంగారు, వెండి ధరలు రోజుకోలా మారుతుండటంతో ధరల తేడా కారణంగా డాలర్ల అమ్మకాల ద్వారా టీటీడీకి పెద్దగా లాభం రావడం లేదని సమాచారం. మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య టీటీడీ డాలర్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
