
D Spiritual: Jan 28: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు నేడు తెరలేచింది. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ప్రతీకలైన ఆదివాసీ దేవతల దర్శనం కోసం కోట్లాది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు ఈ మహాజాతర కొనసాగనుంది.
జాతర ప్రారంభోత్సవంగా ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి చేరుకోనున్నారు.
భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈసారి తొలిసారిగా AI టెక్నాలజీని వినియోగిస్తున్నారు. 13 వేల మంది పోలీసులతో పాటు 20 డ్రోన్ కెమెరాలు, 480 సీసీ కెమెరాల ద్వారా 24/7 నిఘా కొనసాగుతోంది. దాదాపు కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
నాలుగు వేలకుపైగా ఆర్టీసీ బస్సులు, రెండు లక్షలకుపైగా ప్రైవేటు వాహనాలతో అన్ని మార్గాలు మేడారం వైపే దారి తీస్తున్నాయి. ఆరు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుండగా, ఐదు ప్రధాన రూట్ల ద్వారా రాకపోకలు సాగుతున్నాయి.
మేడారం జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరను గిరిజన సంప్రదాయాలతో వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కోటిన్నరకు పైగా భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
