
D Spiritual: Jan 27: యతి తీర్థయాత్రలు ఎప్పుడూ చేయకూడదు, అలాగే ఉపవాస దీక్షలు కూడా సర్వదా పనికిరావని ఇందులోని భావం. భక్తి అనేది శరీరాన్ని కష్టపెట్టడం కాదు, మనసును శుద్ధి చేసుకోవడమే అన్న సందేశాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది.
లక్ష్మీబాయి షిండే అనే మహిళ ప్రతిరోజూ శిరిడీ సాయిబాబా దగ్గరికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసుకునేది. ఒక రోజు ఆమె చాలా బలహీనంగా కనిపించినా సేవ చేయడానికి వచ్చింది. ఇది గమనించిన బాబా ఆమెను కారణం అడిగాడు. అప్పుడు ఆమె “మీ ఆశీర్వాదం కోసం ఉపవాసం చేస్తున్నాను” అని చెప్పింది.
దానికి బాబా చిరునవ్వుతో, “నా ఆశీర్వాదం కోసం ఉపవాసం చేయమని నేను చెప్పానా? ఉపవాసం నాకు అక్కర్లేదు. నువ్వు ఆకలితో బాధపడితే నాకు సంతోషమా? నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం” అంటూ తన చేతిలోని ప్రసాదాన్ని ఆమెకు ఇచ్చి, “తిను, బలంగా ఉండు. సత్కర్మలు చెయ్యి. అదే నిజమైన వ్రతం. దయ, సేవ, నిజాయతీ — ఇవే నా పూజలు” అని ఉపదేశించాడు.
బాబా మాటలకు లక్ష్మీబాయి ఎంతో సంతోషించింది. భక్తి అంటే శరీరానికి కష్టం పెట్టడం కాదు, మనసును శుద్ధి చేసుకోవడమే అన్నది బాబా అభిమతమని ఆమె గ్రహించింది. ఆ తర్వాత లక్ష్మీబాయి ప్రతిరోజూ పాలల్లో నానబెట్టిన రొట్టెను బాబాకు సమర్పించేది. ఈ విధంగా ఆమె జీవితాంతం సేవ కొనసాగించింది. బాబా ఆమెను ప్రేమగా “లక్ష్మీమా” అని పిలిచేవారు.
సాయి బాబా సమాధి చెందే సమయంలో లక్ష్మీబాయికి తొమ్మిది నాణేలను ప్రసాదించాడు. వాటిని నవవిధ భక్తులకు ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీబాయి షిండే 115 సంవత్సరాలు జీవించి 1993లో కన్నుమూసింది.
