
D Spiritual: Jan 27: చిన్న పిల్లలు జన్మించిన 21 రోజుల తర్వాత పెద్దవారు వెండి మొలతాడు కడతారు. కానీ ఇంత చిన్న వయసులోనే మొదటగా వెండి మొలతాడే ఎందుకు కడతారనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దీని వెనుక ఉన్న కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లలకు వెండి మొలతాడు కట్టడం వెనుక అనేక నమ్మకాలు, ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా ఇది పిల్లల నుంచి ప్రతికూల శక్తులను దూరం చేయడమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని విశ్వాసం ఉంది.
లోహాలు శరీరంపై ప్రత్యేక ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా వెండికి చల్లని గుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిన్న పిల్లలకు వెండి మొలతాడు కట్టడం వల్ల శరీరంలోని అధిక వేడి గ్రహించబడి, శరీరం చల్లబడేలా చేస్తుందని చెబుతారు. ఈ కారణంగానే పిల్లలకు వెండి మొలతాడు కడతారని పెద్దల అభిప్రాయం.
అలాగే నడుముపై మొలతాడు కట్టుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయని నమ్మకం ఉంది. అంతేకాకుండా వెన్నుముక ఆరోగ్యం కోసం కూడా ఈ మొలతాడును పిల్లలకు కడతారని చెబుతారు.
ముఖ్యంగా చెడు దృష్టి నుంచి పిల్లలను రక్షించేందుకు, ప్రతికూల శక్తులను దూరం చేయడానికి మొలతాడు కడతారని విశ్వాసం. ఇక వెండి మొలతాడు కట్టడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా మగ పిల్లల్లో జననాంగాల ఆరోగ్యానికి, వృషణాల ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని నిపుణుల అభిప్రాయం.
