
D Spiritual: Jan 27: చాలా మంది పెద్దవారు ఇంటి ఆడపిల్లలు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం గడపపై కూర్చోకూడదు అని చెబుతుంటారు. అలా కూర్చోవడం ఇంటికి మంచిది కాదని, కుటుంబంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని వారి నమ్మకం. అయితే దీనికి కారణం ఏమిటి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
ఇంటి ప్రధాన ద్వారం చాలా శక్తివంతమైన ప్రదేశంగా భావిస్తారు. ఇంటి పురోగతి, శ్రేయస్సు మొత్తం ఈ ద్వారంపైనే ఆధారపడి ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా గడపను “లక్ష్మీస్థానం”గా పరిగణిస్తారు. అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దల విశ్వాసం. అందుకే గడప విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు.
ప్రతి ఇంటిలోనూ ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి పూజలు చేస్తుంటారు. ప్రతిరోజూ ఉదయం గడపకు పసుపు పూసి, ముగ్గులు వేసి, కుంకుమతో అలంకరిస్తారు. గడపను గౌరవంగా చూసుకోవడానికి కారణం — అది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకొని, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్మకం. గడపను అగౌరవపరిస్తే లక్ష్మీదేవిని అగౌరవించినట్లేనని, దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెబుతారు.
ఇక ముఖ్యంగా ఇంటి ఆడపిల్ల గడపపై లేదా గుమ్మం ముందు కూర్చోవద్దని పెద్దలు హెచ్చరిస్తారు. దీనివల్ల దృష్టి దోష ప్రభావం ఎక్కువగా పడుతుందని, అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం, అప్పులు పెరగడం, ఊహించని ఖర్చులు రావడం జరుగుతాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం.
అలాగే గడపపై కాలు పెట్టడం కూడా లక్ష్మీదేవిని అగౌరవించినట్లేనని చెబుతారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కోపించి ఇంటిని విడిచి వెళ్తుందని, ఫలితంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, విభేదాలు, కెరీర్లో అడ్డంకులు, అనుకున్న పనులు సమయానికి పూర్తికాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని అంటారు. అందుకే ప్రధాన ద్వారం గడప విషయంలో మన పెద్దలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు.
