
DNews: Jan 24: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, సింగరేణిపై అబద్ధపు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. కొంతమంది వ్యక్తులు సింగరేణి గౌరవాన్ని దెబ్బతీయడానికి వ్యాసాలు రాస్తున్నారని, ఈ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రశ్నించారు. కార్మికుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సంస్థపై ఆరోపణలు చేయడం తప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి స్వతంత్ర సంస్థ అని, అన్ని నిర్ణయాలను వారు స్వయంగా తీసుకుంటారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సైట్ విజిట్ నిబంధనను సింగరేణిలో కొత్తగా ప్రవేశపెట్టినట్లు ప్రచారం జరుగుతుందని, కానీ వాస్తవానికి కోల్ ఇండియా 2018లో, NMDC 2021లోనే ఈ నియమాన్ని అమలు చేశాయని, సింగరేణిలో 2023లో CMPDI పత్రం ప్రకారం ఇది తప్పనిసరి అయ్యిందని వివరించారు. రైల్వేలు, హిందుస్తాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలో కూడా ఈ నియమం అమలులో ఉందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పాలనలోనే నైనీ బ్లాక్ టెండర్లలో డీజిల్ విధానం మార్పు జరిగిందని, 25 టెండర్లలో 20 బీఆర్‌ఎస్ కాలంలోనే జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 5 టెండర్లు మాత్రమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు సంబంధించిన ఎవరూ ఇప్పటివరకు టెండర్లు పొందలేదని, సీఎం రేవంత్‌కు సృజన్ రెడ్డి సంబంధం ఉందన్న వార్తలు అసత్యమని ఖండించారు. సృజన్ రెడ్డి ‘శోధా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి చెందినవారని, దీప్తి రెడ్డి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అని, ఆమె కందాల కుమార్తె, సృజన్ రెడ్డి మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అల్లుడు అని వివరించారు. హరీష్ రావు కేంద్రానికి లేఖలు రాయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రశ్నిస్తూ, 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరగాలని కోరారు. తాడిచర్ల నుండి నైనీ వరకు అన్ని టెండర్లను పరిశీలించాలని, సీఎం రేవంత్ వచ్చిన వెంటనే దీనిపై చర్చించి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. తాను ఆస్తులు కూడబెట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని, బొగ్గు గనుల్లో ఎలాంటి దోపిడీ జరగనివ్వబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
