
DSports Jan12 2026:నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచింది. ఈ మ్యాచ్ మొత్తానికి సోఫీ డివైన్ వన్-ఉమెన్ షోగా నిలిచింది. బ్యాటింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించడమే కాకుండా, బౌలింగ్‌లో ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించి గుజరాత్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
- టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్‌కు సోఫీ డివైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 95 పరుగులు బాది తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. స్నేహ రాణా వేసిన ఒకే ఓవర్లో సోఫీ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఓవర్లలో ఒకటిగా నిలిచింది.ఆమె ధాటికి గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు సాధించింది.
- 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా గట్టిగానే పోరాడింది. లిజెల్లీ లీ (86), లారా వోల్వార్ట్ (77) అద్భుతంగా ఆడటంతో ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి.చేతిలో 5 వికెట్లు ఉన్నాయి, క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు ఉన్నారు.. ఢిల్లీ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో సోఫీ డివైన్ బంతిని చేతబట్టింది. సోఫీ తన అనుభవాన్నంతా ఉపయోగించి కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి, కీలకమైన 2 వికెట్లు (జెమీమా రోడ్రిగ్స్, లారా వోల్వార్ట్) పడగొట్టింది. దీంతో గుజరాత్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది.
