
D D Spiritual: Jan 6: ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవానికి డ్రోన్ కెమెరాల ద్వారా పూల వర్షం కురిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే గురువయ్యాల నాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
“ఓం నమః శివాయ… ఓం నమః శివాయ…” అనే శివనామ స్మరణతో ఎమ్మిగనూరు పట్టణమంతా మారుమోగింది. ఉదయ భానుడు అస్తమించే వేళ వేద పండితుల మంత్రోచ్చారణలు, నాయీ బ్రాహ్మణుల మంగళ వాయిద్యాలు, కళాకారుల సంప్రదాయ–జానపద ప్రదర్శనల నడుమ శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం కనుల పండువగా సాగింది. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ రథోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పార్వతి పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం ఈ ఏడాది కూడా వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. హరి ఓం హర నినాదాలతో పట్టణమంతా శివమయంగా మారింది.
కళ్యాణ మహోత్సవంలో భాగంగా వరుడు పరమేశ్వరుడి తరపున గడిగే వంశస్తులు, వధువు పార్వతి తరపున బండా వంశస్తులు, మధ్యవర్తులుగా మాచాని వంశస్తులు పాల్గొన్నారు. మొత్తం 21 గోత్రాల వారు సంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.
అనంతరం ఉత్సవ మూర్తులైన పార్వతి పరమేశ్వరులను మహారథంపై ఆసీనుల్ని చేసి అశేష భక్తజన నడుమ పట్టణ వీధుల గుండా ఊరేగించారు. ఈ ఏడాది రథోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ కెమెరాల ద్వారా పూల వర్షం కురిపించడం ఉత్సవానికి మరింత వైభవాన్ని చేకూర్చింది.
రథోత్సవం మధ్యలో నిర్వహించిన గురువయ్యాల నాట్య ప్రదర్శన ఉత్సవానికి అదనపు శోభను తీసుకొచ్చింది. శివభక్తి, కళ, సంప్రదాయం సమన్వయంగా మేళవించిన ఈ దృశ్యాలు భక్తుల హృదయాలను ఆహ్లాదపరిచాయి.
