
D Spiritual: Jan 6: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 తేదీలు ఖరారయ్యాయి. భక్తుల కోలాహలంతో నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చే ఈ మహా జాతరను 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ పవిత్ర జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనంతో భక్తులు తమ మొక్కులు చెల్లించి, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ జాతర తెలంగాణ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.
జాతరలో భాగంగా జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క వనదేవతలు మేడారం గద్దెలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు ఘన స్వాగతం పలుకుతారు.
జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించనున్నారు. ఈ రోజున మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అనంతరం జనవరి 31న సాయంత్రం సమ్మక్క–సారలమ్మలు తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతరకు అధికారికంగా ముగింపు పలకనున్నారు.
