
D Spiritual: Jan 6: సంకటహర చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన పవిత్రమైన వ్రతదినం. ఈ తిథి మంగళవారం వస్తే దానిని అంగారక సంకష్టి చతుర్థిగా పిలుస్తారు. ఇది సంవత్సరంలో వచ్చే సంకటహర చతుర్థిల్లో అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబ శ్రేయస్సు, పిల్లల దీర్ఘాయుష్షు మరియు ఆనందం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత నాల్గవ రోజున వస్తుంది. దీనినే సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. ఈ తిథి మంగళవారం వస్తే అంగారక సంకటహర చతుర్థిగా పరిగణిస్తారు. ఈ అంగారక సంకటహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగతా సంకటహర చతుర్థిల కంటే అత్యంత ముఖ్యమైనదిగా పండితులు పేర్కొంటారు. ఈ సంవత్సరం ఈ పవిత్ర వ్రతం మంగళవారం జనవరి 6న వచ్చింది. ఇది చాలా అరుదైన రోజు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శించి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం మాత్రమే ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజున వినాయకుడు మరియు చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయని, ఆర్థిక సమస్యలు మరియు అప్పుల బాధలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
వినాయకుడు విఘ్నాధిపతి కావడంతో ఆయన కటాక్షం ఉంటే జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని భావిస్తారు. జ్ఞానం, తెలివితేటలు, విజయానికి ఆయన అధిపతి. అందుకే ఈ రోజున చేసిన పూజలు మంచి ఫలితాలను ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ సంవత్సరం చవితి తిథి జనవరి 6వ తేదీ ఉదయం 11.37 గంటల నుంచి జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 10.46 గంటల వరకు ఉంటుంది. చంద్రోదయం కలిసిన రోజునే సంకటహర చతుర్థిని ఆచరిస్తారు కాబట్టి జనవరి 6వ తేదీన ఈ వ్రతం జరుపుకుంటారు. ఈ రోజున మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలిసివచ్చినందున దీనిని అంగారక సంకటహర చతుర్థిగా పేర్కొంటారు.
అయితే ఈ రోజున కొంత సమయం భద్ర కాలం కూడా ఉంటుంది. భద్ర కాలంలో పూజలు లేదా శుభ కార్యాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. అందువల్ల భక్తులు శుభ ముహూర్తంలోనే పూజలు, సంకల్పం, ప్రార్థనలు చేస్తారు. రాత్రి చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్ర దర్శనం చేసి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం ఉపవాసం విరమించడంతో సంకటహర చతుర్థి వ్రతం పూర్తి అవుతుంది.
