
DNews:26 Dec: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో సరకు రవాణా ముసుగులో జరుగుతున్న గోవుల అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో, నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు లారీలో సరకు ఉన్నట్లు నమ్మిస్తూ పైన పూర్తిగా టార్పాలిన్ కవర్‌తో కప్పేశారు. అయితే, లోపల ఉన్న గోవులకు ఊపిరి ఆడటం కోసం కవర్‌పై అక్కడక్కడా రంధ్రాలు చేయడం పోలీసులకు అనుమానం కలిగించింది.
అనుమానంతో లారీని ఆపి టార్పాలిన్ కవర్‌ను తొలగించి తనిఖీ చేయగా, లోపల అక్రమంగా తరలిస్తున్న గోవులు బయటపడ్డాయి. అత్యంత ఇరుకైన స్థితిలో గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించామని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
