
DNews:26 Dec: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్‌కు బుద్ధి, జ్ఞానం లేదని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో విడుదల చేసిన వీడియోలో కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవగాహన లేని మాటలని అన్నారు.
కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పాలన సాగించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల మద్దతుతో, మెరిట్ కోటాలో సీఎం అయ్యారని, కేటీఆర్ మాత్రం మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి, ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజల ఆదరణ పొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి నాయకత్వమే కారణమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలపై నియంతృత్వ పాలన సాగిందని ఆరోపిస్తూ, అక్రమ కబ్జాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
