
DSport Dec26 2025:న్యూఢిల్లీ: భారత యువ క్రికెట్ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కెరీర్లో మరో అద్భుత మైలురాయిని చేరుకున్నాడు. క్రీడారంగంలో అతను కనబరుస్తున్న అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అతడిని ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025’ తో గౌరవించింది.
నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఘనమైన వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ సహా ఇతర విజేతలు ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు.
గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేయగా, వైభవ్ అంతకంటే ముందే తన బ్యాటింగ్ విధ్వంసంతో దేశం దృష్టిని ఆకర్షించాడు. త్వరలో జరగనున్న అండర్-19 ప్రపంచకప్లో కూడా వైభవ్ భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
