
D Spiritual: Dec 20: సాధారణంగా గుడికి దగ్గరలో ఇల్లు నిర్మించకూడదని మన పెద్దలు చెబుతుంటారు. గుడి నీడ మన ఇంటిపై పడటం వల్ల అనేక చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని పండితుల అభిప్రాయం. అందుకే పూర్వకాలంలో ఆలయ గర్భగుడి చుట్టూ రెండు లేదా మూడు ప్రహరీ గోడలను నిర్మించేవారు. అయితే గుడికి దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చా? కట్టుకుంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే విషయం చాలా మందికి ఆసక్తికరంగా మారింది.
హిందూ పురాణాల ప్రకారం గుడికి సమీపంలో ఇల్లు నిర్మించుకోవడం వల్ల మంచి–చెడు రెండురకాల ప్రభావాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలయం బయట ఉన్న ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడకూడదని శాస్త్రోక్తంగా పేర్కొంటారు. అలాగే ధ్వజస్తంభానికి ఎదురుగా కూడా ఇల్లు నిర్మించకూడదని సూచిస్తారు.
శివాలయాలు, అమ్మవారి ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలకు చాలా దగ్గరలో ఇల్లు నిర్మించడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు నిర్మించాల్సి వస్తే, గుడికి కనీసం 100 అడుగుల దూరంలో ఇల్లు నిర్మించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శివుడి దృష్టి ఎల్లప్పుడూ ఇంటిపై ఉండటం శుభకరం కాదని విశ్వాసం.
అలాగే విష్ణు ఆలయానికి సమీపంలో ఇల్లు నిర్మించాలనుకునే వారు ఆలయానికి కనీసం 30 అడుగుల దూరంలో ఇంటిని నిర్మించుకోవడం మంచిదిగా భావిస్తారు. విష్ణు ఆలయాల విషయంలో కొంత సానుకూలత ఉన్నప్పటికీ, అవసరమైన దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని చెబుతారు.
కొన్ని శక్తి ఆలయాలకు చాలా దగ్గరలో ఇల్లు నిర్మించడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు, ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల శక్తి ఆలయాలకు దగ్గరలో ఇల్లు నిర్మించాలనుకునేవారు కనీసం 120 అడుగుల దూరంలో ఇంటిని నిర్మించుకోవడం మంచిదిగా సూచిస్తున్నారు.
ఇతర దేవాలయాల చుట్టూ ఇల్లు నిర్మించుకునే వారు కూడా కనీసం 100 అడుగుల దూరాన్ని పాటించాల్సి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటిని నిర్మించిన తర్వాత ఆలయ నీడ మన ఇంటిపై పడకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే కుటుంబంలో తరచూ సమస్యలు, అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
