
D Spiritual: Dec 19: ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికుల కోసం మరో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ద్వారా కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ కాచిగూడ నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. సంక్రాంతి సెలవుల్లో కుటుంబం లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైలు టికెట్ల బుకింగ్, భోజన సేవలతో పాటు పర్యాటకులకు ఉపయోగపడే విధంగా వివిధ టూరిజం ప్యాకేజీలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సులభంగా సందర్శించేలా ఈ ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తోంది. వీటితో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా కొత్త ప్రాంతాలను సందర్శించవచ్చు.
ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్న ఐఆర్‌సీటీసీ, తాజాగా కోస్టల్ కర్ణాటక ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ద్వారా ఉడుపి, శృంగేరి, మురుడేశ్వర్, మంగళూరు వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతీ మంగళవారం కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. మొత్తం ఆరు రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది.
ఈ ప్యాకేజీలో ప్రయాణికులు సందర్శించే ప్రాంతాల్లో ఉడుపి శ్రీకృష్ణ ఆలయం, మూకాంబిక ఆలయం, మురుడేశ్వర్ శివాలయం, గోకర్ణ, హోర్నాడు అన్నపూర్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయం, మంగళూరులోని మంగళాదేవి ఆలయం, కాద్రి మంజునాథ ఆలయం, తన్నీర్భవి బీచ్, గోకర్ణాథ ఆలయం ఉన్నాయి.
ప్యాకేజీ ధర విషయానికి వస్తే, స్లీపర్ క్లాస్‌లో సింగిల్ పర్సన్‌కు రూ.38,060, డబుల్ షేరింగ్‌కు రూ.20,650, త్రిబుల్ షేరింగ్‌కు రూ.15,970, ఛైల్డ్ విత్ బెడ్‌కు రూ.9,100, ఛైల్డ్ వితౌట్ బెడ్‌కు రూ.7,720గా నిర్ణయించారు. అలాగే థర్డ్ ఏసీ క్లాస్‌లో సింగిల్ పర్సన్‌కు రూ.41,630, డబుల్ షేరింగ్‌కు రూ.23,670, త్రిబుల్ షేరింగ్‌కు రూ.19,000, ఛైల్డ్ విత్ బెడ్‌కు రూ.12,140, ఛైల్డ్ వితౌట్ బెడ్‌కు రూ.10,740గా ఉంది.
ప్రయాణ వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన రైలు, బుధవారం ఉదయం 9.15 గంటలకు మంగళూరుకు చేరుకుంటుంది. ఆ రోజు ఉడుపి శ్రీకృష్ణ ఆలయం దర్శనం ఉంటుంది. గురువారం మూకాంబిక ఆలయం, మురుడేశ్వర్‌లో శివాలయం, గోకర్ణ సందర్శనాలు ఏర్పాటు చేశారు.
శుక్రవారం హోర్నాడు అన్నపూర్ణ ఆలయం, శృంగేరి శారదాంబ ఆలయం దర్శనం కల్పిస్తారు. శనివారం మంగళూరులో మంగళాదేవి ఆలయం, కాద్రి మంజునాథ ఆలయం, తన్నీర్భవి బీచ్, గోకర్ణాథ ఆలయం సందర్శనలు ఉంటాయి. ఆదివారం ప్రయాణికులు తిరిగి కాచిగూడకు చేరుకుంటారు.
