
D Spiritual: Dec 19: దీపారాధన చేసిన తరువాత అనుకోకుండా దీపం ఆరిపోతే మళ్లీ వెలిగించవచ్చా? లేకపోతే పూజను మొదటి నుంచి తిరిగి చేయాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ అంశంపై ఆధ్యాత్మిక పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొంతమంది భక్తులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ నిత్య దీపారాధన సమయంలో కొందరు తెలిసి తెలియక కొన్ని చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాగే దీపారాధన చేసే విధానం, పాటించాల్సిన నియమాలపై చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతుంటాయి.
దీపారాధన చేసిన తరువాత వత్తుల విషయంలో ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పూజ గదిలో ఒక రోజు ఉపయోగించిన వత్తులను మరుసటి రోజు మళ్లీ ఉపయోగించకూడదట. ప్రతి రోజు కొత్త వత్తులను వేసి దీపారాధన చేయాలని సూచిస్తున్నారు. కొంతమంది వత్తులు బాగానే ఉన్నాయనే కారణంతో మరుసటి రోజు కూడా అవే వెలిగిస్తుంటారు. కానీ ఇలా చేయడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు.
ఒకే దీపంలో బహుళ వత్తులు వేసి వెలిగించినప్పుడు, వాటిలో ఏదైనా ఒక వత్తి ఆరిపోయి మిగతావి వెలుగుతూ ఉంటే, వెలుగుతున్న వత్తితో ఆరిపోయిన వత్తిని మళ్లీ వెలిగించవచ్చని పండితులు తెలిపారు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదని పేర్కొంటున్నారు.
అలాగే ఒకవేళ మీరు వెలిగించిన అన్ని వత్తులు ఒకేసారి ఆరిపోయినట్లయితే, అప్పటికప్పుడు వాటిని మళ్లీ వెలిగించవచ్చని చెబుతున్నారు. ఈ సందర్భంలో పూజను మొదటి నుంచి మళ్లీ చేయాల్సిన అవసరం లేదని పండితుల అభిప్రాయం.
దీపారాధనలో ఉపయోగించే వత్తులు కేవలం ఆ రోజుకే పరిమితమని చెబుతున్నారు. అందువల్ల నిత్య దీపారాధన చేసే వారు ప్రతిరోజూ కొత్త వత్తులు ఉపయోగించి పూజ చేయాలని సూచిస్తున్నారు.
ఇక దీపారాధన చేసే విధానంలో కూడా ఒక ముఖ్యమైన నియమం ఉంది. చాలామంది ముందుగా వత్తిని దీపంలో పెట్టి ఆ తర్వాత నూనె పోస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదట. ముందుగా దీపపు కుందులో నూనె పోసి, ఆ తరువాత మాత్రమే వత్తిని ఉంచి దీపం వెలిగించాలట. ఈ విధానాన్ని పాటిస్తే దీపారాధన సంపూర్ణ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
