DET:DEC 19:
కథను కాపీ కొట్టారని కోర్టు నిర్ధారణ:
2012లో మేజర్ రవి దర్శకత్వంలో విడుదలైన కర్మయోధ సినిమా కథ తనదేనని స్క్రిప్ట్ రైటర్ నౌషాద్ గతంలో కోర్టును ఆశ్రయించారు.తాను రాసుకున్న కథను దర్శకుడు అనుమతి లేకుండా వాడుకున్నారని ఇది మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన అని ఆయన వాదించారు.సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ కేసు విచారణలో సినిమా కథలో నౌషాద్ రాసిన అంశాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది.దీంతో దర్శకుడు మేజర్ రవి ప్లగియరిజంకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.

రూ.30 లక్షల భారీ జరిమానా:
ఈ కేసులో బాధితుడైన నౌషాద్‌కు న్యాయం చేస్తూ దర్శకుడు మేజర్ రవి ఆయనకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.ఒక రచయిత కష్టాన్ని గుర్తింపు లేకుండా వాడుకోవడం చట్టరీత్యా నేరమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు సెటిల్మెంట్ల ద్వారా ముగుస్తుంటాయి.కానీ కోర్టు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం టాలీవుడ్,మాలీవుడ్ సహా అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారింది.

రచయితల హక్కులకు దక్కిన విజయం:

సినిమా రంగంలో కథా రచయితలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.ఈ తీర్పుతో రచయితల హక్కులకు పెద్దపీట వేసినట్లయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎవరైనా సరే ఇతరుల మేధో సంపత్తిని కాపీ కొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.మోహన్‌లాల్ వంటి స్టార్ హీరో నటించిన సినిమాపై ఇలాంటి ఆరోపణలు రావడం మరియు అది నిరూపితం కావడం విశేషం.