D Spiritual: Dec 12: నారదుడు గానబంధు వద్ద సంగీతాన్ని వెయ్యేళ్ల పాటు అభ్యసించాడని పురాణాలు చెబుతాయి. కఠోర దీక్షతో సాధన చేస్తూ మొత్తం 3,60,006 రాగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. సహపాఠకులంతా అతని ప్రతిభను పొగడగా, నారదుడి అంతరంగంలో గర్వం పెరిగి, సంగీతంలో తనకు సమానం ఎవరూ లేరనే భావన పెరిగిపోయింది. ఈ ఆనందంతో నిండిన నారదుడు గురువు ఉలూకపతిని దర్శించి, గురు దక్షిణగా ఏమి కావాలో కోరుకోమని వినయంగా అడిగాడు.

దీనికి గురువు ఉలూకపతి, “ఈ భూమి ఉన్నంతవరకు సంగీతకళతో పాటు నా పేరు కూడా గుర్తుండిపోయే వరం ప్రసాదించు” అని కోరాడు. గురువు హృదయంలోని ఆ కోరికను నారదుడు అర్థం చేసుకున్నాడు. అయితే నారదుడు, “ఇది చాలా చిన్న కోరిక. ఇది నేను తీర్చాల్సిన అవసరం లేదు. మీ సంగీత పాండిత్యమే మీ పేరును నిలబెడుతుంది. భూమిపై సంగీతం ఉన్నంతకాలం మీకు కీర్తి నష్టమవదు” అని చెప్పాడు.

తాను సంగీతం నేర్చుకున్న గుర్తుగా నారదుడు స్వయంగా గురుదక్షిణను ఇవ్వబోతున్నాడని తెలిపాడు. గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవాభాగ్యం, శాశ్వత సన్నిధానం ప్రసాదిస్తున్నానని ఉలూకపతికి వరమిచ్చాడు. అలాగే ప్రళయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు ఎలా వాహనమో, అలాగే శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనంగా సేవ చేసే అవకాశం నీకు లభిస్తుందని చెప్పాడు.

నారదుడు ప్రసాదించిన ఈ వరం ఫలితంగా ఉలూకపతి, శ్రీ మహాలక్ష్మికి శాశ్వత వాహనంగా నిలిచాడని పురాణాలు పేర్కొంటాయి.