
D Spiritual: Dec 10: దేవతా వృక్షాల్లో కదంబ వృక్షాలకు విశిష్టమైన స్థానం ఉంది. కాశీ పుణ్యక్షేత్రం తరువాత త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయ ఆవరణలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఎరుపు రంగులో ఉండే కదంబ పూలు భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయని విశ్వాసం.
ఈ వృక్షాలను సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజించడం ఆనవాయితీ. కదంబవాసినిగా పేరుగాంచిన పార్వతీదేవి ఇవి ఉన్న ప్రాంతాల్లో వనవాసం చేశారని పురాణాల్లో ఉల్లేఖనాలున్నాయి. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే ఈ వృక్షాలను సంరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే అని పండితులు చెబుతారు.
దేవతా వృక్షాల్లో ప్రథమ స్థానంలో నిలిచే ఈ కదంబ వృక్షాలు త్రిపురాంతకంలో గతంలో విస్తారంగా ఉండేవి. కాలక్రమేణా వీటి సంఖ్య తగ్గడంతో ఆలయ నిర్వాహకులు, పండితులు తీసుకున్న చర్యల వల్ల మళ్లీ సంఖ్య పెరిగింది. ఇప్పుడు అమ్మవారి ఆలయం చెరువు కట్టపై ఈ వృక్షాలు అధికంగా కనిపిస్తాయి.
కాశీ తరువాత కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపించే ప్రాంతం త్రిపురాంతకమే అని స్థలపురాణాలు, చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బాలా త్రిపురసుందరీదేవి కదంబవాసినిగా ఉన్నందున ఇక్కడ ఇవి విస్తారంగా పెరిగాయని నమ్మకం ఉంది.
అలాగే కదంబ వృక్షాలు శ్రీకృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. రాధాకృష్ణుల ప్రణయగాధలు ఈ వృక్షాల నీడలోనే ప్రారంభమయ్యాయని, వారు ఎక్కువగా ఈ చెట్టు కిందే విశ్రాంతి తీసుకునేవారని చెబుతారు. లలితాసహస్రనామంలో కూడా త్రిపురాంతకం, కాశీ వంటి క్షేత్రాల్లో తప్ప మరెక్కడా ఈ వృక్షాలు విస్తారంగా లేవని పండితులు సూచిస్తున్నారు.
