DET:DEC 10:
సంజయ్ కపూర్ రూ.30,000 కోట్ల కేసు విదేశీ ఆస్తులపై ఢిల్లీ హైకోర్టుకు అధికారం లేదన్న ప్రియా కపూర్:
దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ సుమారు రూ.30,000 కోట్ల ఆస్తికి సంబంధించిన వారసత్వ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది.సంజయ్ మూడవ భార్య అయిన ప్రియా కపూర్ ఈ ఆస్తి వివాదంపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, అమెరికా,బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్న తన భర్త ఆస్తుల విషయంలో,వాటిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టుకు అధికారం లేదని స్పష్టం చేశారు.

విదేశీ ఆస్తులపై నియంత్రణ మా పరిధి కాదంటున్న ప్రియా కపూర్:
సంజయ్ కపూర్‌కు,ఆయన మొదటి భార్య అయిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ద్వారా కలిగిన పిల్లలు సమైరా మరియు కియాన్‌లు తమ తండ్రి ఆస్తిలో వాటా కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సంజయ్ మరణానంతరం ప్రియా కపూర్ సమర్పించిన వీలునామా నకిలీదని ఆరోపిస్తూ,ఆస్తిని తరలించకుండా ఆమెను నిరోధించాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు.ఈ దరఖాస్తుపై విచారణ సందర్భంగా ప్రియా కపూర్ తరఫు న్యాయవాదులు,విదేశీ ఆస్తుల అంశం పూర్తిగా ఆయా దేశాల న్యాయ పరిధిలోకి వస్తుందని కోర్టుకు తెలిపారు.అందువల్ల విదేశాల్లో ఉన్న స్థిరాస్తుల విషయంలో తమను లేదా తమ మైనర్ కుమారుడిని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపడానికి ఢిల్లీ హైకోర్టుకు అధికారం లేదని వాదించారు.

కేసు నేపథ్యం మరియు తరువాతి విచారణ:

సంజయ్ కపూర్ ఈ ఏడాది జూన్ నెలలో లండన్‌లో పోలో ఆడుతుండగా గుండెపోటుతో మరణించారు.ఆయన మరణం తర్వాత ఆయన వీలునామా విషయంలో తీవ్ర వివాదం మొదలైంది.కరిష్మా కపూర్ పిల్లలు,అలాగే సంజయ్ తల్లి రాణి కపూర్ కూడా వీలునామా ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తారు.ఇదిలా ఉండగా మధ్యంతర దరఖాస్తుపై అన్ని పక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని న్యాయమూర్తి జ్యోతి సింగ్ ఆదేశించారు.ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది.