
D Spiritual: Dec 9: హనుమను ఆరాధిస్తే దుష్టగ్రహ పీడలు, గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కార్యసిద్ధి, శత్రుజయం కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సీతారాములు ఎక్కడ వుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. దేశవ్యాప్తంగా ఎన్నో హనుమాన్ దేవాలయాలు ఉన్నా, కొన్ని మాత్రం అత్యంత ప్రత్యేకమైనవి. అలాంటి ప్రత్యేక హనుమాన్ ఆలయాల్లో పావులూరు వీరాంజనేయ క్షేత్రం ఒకటి.
పావులూరు వీరాంజనేయ క్షేత్రం
హనుమంతుడు ఎక్కడ వుంటే అభయం, అనుగ్రహం అక్కడే ఉంటాయి. ఇదే విషయాన్ని పావులూరులో వెలసిన వీరాంజనేయుడు మరొకసారి రుజువు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షేత్రం ఎక్కడుందో, దాని విశిష్టతలేమిటో తెలుసుకుందాం.
పావులూరు వీరాంజనేయ క్షేత్రం ఎక్కడ ఉంది?
ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని పావులూరు గ్రామంలో ఈ అభయ వీరాంజనేయ క్షేత్రం వెలసి ఉంది. గతంలో ఈ ఆలయం గ్రామ పొలిమేరలో ఉన్నందున ఇక్కడి స్వామిని ‘పోలిమేర వీరాంజనేయుడు’ అని కూడా పిలుస్తారు.
స్థల పురాణం
ఒకప్పుడు కీకారణ్యంగా పిలవబడిన ఈ ప్రాంతంలో ఒక ముని దుష్ట గణాలని పారద్రోలడానికి హనుమాన్ ఉపాసన చేసేవాడు. రేగడి మన్నుపై మంత్రజలం సంప్రోక్షణ చేసి, హనుమత్ బీజాక్షరాన్ని వ్రాసి, అష్టదిగ్బంధనం చేసి మారుతి ప్రతిమను రూపొందించినట్లు పురాణం చెబుతోంది. ఆ ప్రతిమను నేటి ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించారట.
కొంతకాలానికి నిత్యాభిషేకాల వలన ఆ మట్టి ప్రతిమ కరిగిపోయింది. ఆ తరువాత పుణ్య ఘడియలో నాగజెముడు పొదల మధ్య స్వయంభువుగా ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతారు.
నాగజెముడు పొదలపై గరుడ సంచారం
నాగజెముడు పొదలపై గరుడ సంచారాన్ని గమనించిన గ్రామస్థులు ఆశ్చర్యపడి పరిశీలించగా, స్వామివారి ప్రతిమను కనుగొన్నారు. తర్వాత గ్రామ పొలిమేరల్లో ఆ ప్రతిమను ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు.
గర్భాలయం లేని క్షేత్రం
సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో సీతారాములు, ఆంజనేయుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయ విశేషం ఏమంటే—ఇక్కడ గర్భాలయం లేదు. పైకప్పు లేని ఓపెన్ ప్రదేశంలోనే స్వామి దర్శనమిస్తాడు.
గ్రామస్థులు ఎన్నిసార్లు గర్భాలయం కట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, వేసిన కప్పు వెంటనే కూలిపోవడంతో స్వామికి ఇలానే ఇష్టం అనుకుని ఆ ప్రయత్నాన్ని ఆపేశారు.
సప్తవర్ణ శోభితమైన హనుమ
సాధారణంగా హనుమంతుడు సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు. కానీ పావులూరులోని హనుమంతుడు సప్తవర్ణాలతో దర్శనమివ్వడం విశేషం. చూసేకొద్దీ చూడాలనిపించే మోహన రూపం. అలాగే ఆలయంలో సీతారాములతో పాటు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుని ఆలయం కూడా ఉంది. అన్నపూర్ణాదేవికి ప్రత్యేక ఆలయమూ ఉంది.
భక్తులచే నేరుగా పూజలు
ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు చేయవచ్చు. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు, సింధూర పూజలు నిర్వహిస్తారు. సువర్చల సమేత వీరాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు నిత్య పూజలు జరుగుతాయి.
పూజోత్సవాలు
ప్రతి ఏడాది రెండు సార్లు జరిగే హనుమాన్ జయంతి ఈ క్షేత్రంలో ప్రధాన పండుగ. అలాగే ఏడాదికి మూడు సార్లు సువర్చల సమేత ఆంజనేయ స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది.
శివకేశవ శక్తి క్షేత్రం
గ్రహపీడలు, జాతక దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. హనుమద్ దీక్షలకు కూడా ఈ స్థలం ప్రసిద్ధి. ఒకే ప్రాంగణంలో హనుమ, శ్రీరాముడు, పరమేశ్వరుడు విరాజిల్లుతున్న అరుదైన క్షేత్రం ఇది. అందుకే దీనిని శివకేశవ శక్తి క్షేత్రం అంటారు.
ఎలా చేరుకోవాలి?
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, అలాగే సింగరాయకొండ నుండి పావులూరు వీరాంజనేయ క్షేత్రానికి రవాణా సౌకర్యాలు విస్తారంగా అందుబాటులో ఉన్నాయి.
మనమూ తప్పకుండా ఈ పవిత్రమైన పావులూరు వీరాంజనేయ క్షేత్రాన్ని దర్శించాలి. తరిద్దాం!
జై శ్రీరామ్!
