
D Spiritual: Dec 6: మామూలుగా మనం ఎక్కడికైనా అందమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతి అందాలు, వాతావరణం అన్నీ బాగుంటే “స్వర్గంలో ఉన్నాం” అని అనుకుంటాం. స్వర్గం నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ కథల రూపంలో మనం తరచుగా వింటుంటాం. స్వర్గంలోని ప్రతి ఒక్కటి ఎంతో అందంగా, మనోహరంగా ఉంటాయని విశ్వసిస్తారు.
అలాగే ‘స్వర్గపు వృక్షం’ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది నిజంగా తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయమే. ఈ దివ్య వృక్షం ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉంది. ఈ వృక్షం రాత్రిపూట రంగురంగుల పూలను పూయిస్తుంది, ఉదయానికి అవన్నీ రాలిపోతాయి. ఈ అసాధారణ లక్షణాల వలన దీనిని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
పురాణ కథల ప్రకారం, సాగరమథన సమయంలో అమృతంతో పాటు పారిజాత వృక్షం కూడా వెలికి వచ్చిందని చెబుతారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోరిక మేరకు ఈ పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి భూమికి తీసుకువచ్చాడని కూడా కథనం ఉంది. మరొక వైపు, మహాభారత కాలంలో అర్జునుడు ద్వారకాలోని ఈ వృక్షాన్ని ఉత్తరప్రదేశ్లోని కింతూర్ గ్రామానికి తీసుకువచ్చాడని స్థానికులు చెబుతుంటారు.
ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో గల కింతూర్ గ్రామంలో ఉంది. దీనికి ‘పారిజాతం’ అనే పేరుతో పాటు హర్సింగర్, శెఫాలీ, ప్రజక్త వంటి అనేక పేర్లూ ఉన్నాయి. బెంగాల్ రాష్ట్ర పుష్పం కూడా ఇదే. భారీ పరిమాణంలో ఉన్న ఈ పారిజాత వృక్షం ఈ గ్రామంలో మాత్రమే కనిపిస్తుందని విశ్వసిస్తారు.
ప్రతి రాత్రి ఈ చెట్టు ఎంతో అందమైన పూలను వికసిస్తుంది. ఉదయానికి పూసిన పూలన్నీ నేలపై రాలిపోతాయి. బారాబంకి నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింతూర్ గ్రామం మహాభారత కాలానికి చెందినదని చెబుతారు. ఈ గ్రామం పాండవుల తల్లి కుంతి పేరు మీదుగా ఏర్పడిందని కూడా కథనం ఉంది. అజ్ఞాతవాసంలో పాండవులు ఈ ప్రాంతంలో నివసించారని, ప్రతిరోజూ పూలను సమర్పించాల్సిన అవసరం ఉండటంతో అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తెచ్చాడని చెబుతారు.
కింతూర్ గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ పూలు ఉదయం పూస్తుంటే, పారిజాతం మాత్రం రాత్రి పూట వికసించడం ప్రత్యేకత. దీని వెనుక ఇంద్రుని శాపం గురించి విశేషమైన పురాణ కథ కూడా ఉంది. సత్యభామ తన కురులకు ఈ పూలతో అలంకారం చేసుకునేదని, రుక్మణి పూజా కార్యక్రమాల్లో ఈ పూలను ఉపయోగించేదని చెబుతారు. ఈ చెట్టు పగటి కంటే రాత్రిపూట మరింత అందంగా కనిపిస్తూ, రంగురంగుల పూలతో స్వర్గాన్ని తలపిస్తుందని స్థానికులు చెబుతారు.
