
DNews:05 Dec:గ్రామాల నుంచి దూరంగా ఉన్న యువత మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. పండుగలు, శుభకార్యాలు తప్పితే ఊరిని పెద్దగా చూసే అవకాశం లేకుండా పట్టణ జీవనశైలి వారిని గ్రామాలకు దూరం చేసింది. ముఖ్యంగా ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు “రాజకీయాలు మనకేంటి?” అని పట్టణ జీవనానికే ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు.కానీ ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలు ఈ ధోరణిని మార్చుతున్నాయి. నగరాల్లో చదువులు పూర్తి చేస్తున్నా, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా… ఇప్పుడు చాలామంది యువత గ్రామ పంచాయతీల్లో పోటీకి ముందుకు వస్తున్నారు. గ్రామాభివృద్ధి పట్ల యువతలో మళ్లీ ఆసక్తి పెరుగుతోంది.
వనపర్తి జిల్లా ఇందుకు మంచి ఉదాహరణ. పెబ్బేరు మండలం శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన కేఎన్. నిఖిత అనే ఎంబీబీఎస్ విద్యార్థిని సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న నిఖిత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం చర్చనీయాంశమైంది.తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసిల్దార్, తల్లి చిలకమ్మ టీచర్. ఈ నేపథ్యం ఉన్నా, నిఖిత రాజకీయాల్లో అడుగుపెట్టింది మాత్రం గ్రామం కోసం అని స్పష్టం చేస్తోంది.
“యువత ఉద్యోగాల కోసం ఊరికి దూరమవుతున్నారు. అయితే మన గ్రామాన్ని అభివృద్ధి చేసేది ఎవరు?” అనే ప్రశ్నతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఖిత చెబుతోంది.సర్పంచ్‌గా గెలిస్తే గ్రామాన్ని మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చేసి, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపుతానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.చదువున్న యువత మళ్లీ గ్రామ రాజకీయాల్లోకి రావడం గ్రామాభివృద్ధిపై కొత్త ఆశలు నింపుతోంది. గ్రామాల భవిష్యత్తు పట్ల యువత బాధ్యత తీసుకుంటున్నారు అనడానికి నిఖిత ఉదాహరణగా నిలిచింది.
