
DNews:03 Dec:కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు మున్సిపాలిటీలకు నయా పైసా నిధులు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు.నిధుల లేమి కారణంగా మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అభివృద్ధి కుంటుపడి, సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా మున్సిపాలిటీలో డ్రైనేజీలు మరియు అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి సంవత్సరం TUFIDC, పట్టణ ప్రగతి నిధులు సక్రమంగా విడుదల చేసి, పనులు పకడ్బందీగా నిర్వహించినట్లు గుర్తుచేశారు.
ఇటీవల ప్రభుత్వం UI DF పథకం ద్వారా మంజూరు చేసిన రూ. 18.70 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళిక జాబితాను ఎమ్మెల్యే పరిశీలించారు.మంజూరైన UI DF నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.పట్టణంలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీలు, కల్వర్టులు, రహదారుల నిర్మాణానికి నిధులు వెచ్చించాలని ఆదేశించారు.పార్కు నిర్మాణ ప్రతిపాదన ఉపసంహరణ: పట్టణ శివారులో రూ. 2 కోట్లతో నిర్మించ తలపెట్టిన పార్కు నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులను అవసరమున్న చోట కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈ సురేష్, జేవో శివకుమార్, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రవీణ్, రమ్య తదితరులు పాల్గొన్నారు.
