
DET:DEC 02:
స్క్రిప్ట్ వినకుండానే పవన్ కళ్యాణ్ సినిమాకు ఓకే చెప్పిన రాశీ ఖన్నా:
నటి రాశీ ఖన్నా తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఏ సినిమాకు కూడా స్క్రిప్ట్ పూర్తిగా వినకుండా కానీ చదవకుండా కానీ ఆమె సంతకం చేయలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేయబోతున్న చిత్రం విషయంలో మాత్రం ఒక మినహాయింపు ఇచ్చానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో రాశీ ఖన్నా నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పేరు చాలు రాశీ ఖన్నా:
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి స్క్రిప్ట్ వినకుండా సంతకం చేసినట్లు రాశీ తెలిపారు. నేను స్క్రిప్ట్ వినకుండా ఓకే చేసిన ఏకైక సినిమా ఇదే. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆయనకున్న స్టార్డమ్ స్థాయి, రీచ్ చాలా పెద్దవి. ఆయనతో కలిసి పనిచేయాలని నేను ఎప్పుడూ కోరుకున్నాను. అందుకే, ఇది ఆయన సినిమా నేను అందులో భాగం అవుతున్నాను అని తెలిసినప్పుడు ఇంక వేరే ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించాను” అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి పెద్ద కమర్షియల్ చిత్రాలను వాటి స్థాయి, ఎక్కువ మందికి చేరువవుతుంది అనే కారణాల కోసం చేస్తామని కూడా ఆమె తెలిపారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై ప్రశంసలు:
షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసిన అనుభవాలను కూడా రాశీ పంచుకున్నారు. ఆయన ఎందుకు అంత పెద్ద స్టార్ అయ్యారో సెట్లో తెలుసుకున్నాను. ఆయన స్వభావం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మహిళల పట్ల ఆయనకు ఉండే గౌరవం నాకు బాగా నచ్చింది. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన ఆలోచనా విధానం, ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే పద్ధతి గొప్పవి. ఆయన చాలా మంచి వ్యక్తి, గొప్ప నటుడు. ఆయనతో పనిచేయడం నిజమైన మానవత్వం అంటే ఏంటో తెలుసుకోవడానికి నాకు సహాయపడింది” అని రాశీ ఖన్నా ప్రశంసల వర్షం కురిపించారు.
సినిమాలో రాశీ ఖన్నా పాత్ర:
ఈ సినిమాలో రాశీ ఖన్నా ఒక ఫొటోగ్రాఫర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన రాశీ ఖన్నా పార్ట్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది.
