
D Spiritual: Dec 2: రామభక్తుడు హనుమంతుడు రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రధారి. సీతారాములకు పరమదాసుడిగా, రక్షకుడిగా, విజయప్రదాతగా హనుమంతుడు హిందూమతంలో ఎంతో గౌరవం మరియు భక్తి పూర్వకంగా పూజింపబడుతున్న దేవుడు. మంగళవారం మారుతీరాయునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున హనుమంతుడిని సంతోషపరిచే కొన్ని ఆచారాలు, పూజావిధానాలు ఉన్నాయి.
మంగళవారం రోజున రావిచెట్టుకు చెందిన చిరగని 11 ఆకులను సేకరించి, వాటిపై కుంకుమ బియ్యంతో “శ్రీరామ్” అని రాసి మాలగా కట్టి హనుమంతునికి సమర్పిస్తారు. హనుమంతుడు శ్రీరాముడిపై అపార భక్తి కలిగిన వాడు కాబట్టి, రామనామ జపం చేస్తే ఆయన అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. అదేవిధంగా, మంగళవారం హనుమంతుడికి ఎర్ర సింధూరం సమర్పించడం రాజయోగం ప్రాప్తికి దోహదం చేస్తుందని భావిస్తారు.
ఈ రోజు బజరంగబలికి ఎరుపు రంగు చోళాన్ని సమర్పించి, సుందరకాండను పఠిస్తే హనుమంతుడి కృప సదా లభిస్తుంది. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండి, పేదలకు ఆహారం పంచడం శ్రేయస్కరం. ఇది ఇంట్లో ధన ధాన్యాదికాలు తగ్గకుండా ఉండేందుకు సహాయపడుతుందని విశ్వాసం. చెడు కలలను దూరం చేసుకోవాలంటే పటికను పాదంతో తాకి నిర్జన ప్రదేశంలో వేయడం వంటి ఆచారాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందాయి.
హనుమంతుడి ఆశీర్వాదం కోసం రామరక్షా స్తోత్రం జపించడం, మంగళవారం మరియు శనివారం రోజుల్లో శెనగలను నైవేద్యంగా పెట్టి సుందరకాండ పారాయణం చేయడం శ్రేయస్కరం. శనివారం నాడు లవంగాలు, యాలకులు, తమలపాకులు హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే శని సంబంధిత బాధలు తొలగుతాయని నమ్ముతారు. ఆవనూనెలో లవంగాలు వేసి పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
హనుమంతుడికి ఐదు సంఖ్య ఎంతో ప్రీతికరం కనుక, ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆలయాల్లో లభించే సింధూరాన్ని నుదుటిపై ధరించడం, ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఆయురారోగ్యాలు పొందుతారని అంటారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పండ్లు, మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడి అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది.
