
DSports 02 Dec:రాయ్‌పూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డేకు ముందు బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి బోర్డు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సమావేశం ప్రధానంగా జట్టు ప్రదర్శన, భవిష్యత్తు ప్రణాళిక, ఆటగాళ్ల ఎంపికలో స్థిరత్వంపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌లో (0-2) ఓటమి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది.
టెస్ట్ సిరీస్ వైఫల్యంపై సమీక్ష: టెస్ట్ క్రికెట్‌లో జట్టు వైఫల్యం, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.
వ్యూహాలు, ప్రణాళికపై స్పష్టత: “ప్రస్తుతం టీమ్ఇండియా వ్యూహాలు కొన్నిసార్లు గందరగోళానికి గురి చేస్తున్నాయి. రాబోయే టీ20 ప్రపంచ కప్, ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని మరింత స్పష్టత, ముందస్తు ప్రణాళికను కోరుకుంటున్నాం” అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ గ్యాప్: కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే వార్తలపైనా స్పష్టత తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంపికలో స్థిరత్వం: సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయాన్ని పెంచడం, ఎంపికలో స్థిరత్వాన్ని కొనసాగించడం కూడా ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం.
ఈ సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాతో పాటు గంభీర్, అగార్కర్ పాల్గొనే అవకాశం ఉంది.
