
DSports 2 Dec: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ వేలానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు.
పీఎస్‌ఎల్‌కు ప్రాధాన్యత: మొయిన్ అలీ ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే కాకుండా, తన దృష్టిని పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వైపు మళ్లించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పీఎస్‌ఎల్ 2026లో ఆడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, “కొత్త శకం” లో భాగం కావడం ఉద్వేగంగా ఉందని పేర్కొన్నారు. 2020లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడిన తర్వాత మళ్లీ ఆయన పీఎస్‌ఎల్‌లో ఆడనున్నారు.
కేకేఆర్ విడుదల చేయడంతోనే నిర్ణయం? మొయిన్ అలీ గత ఐపీఎల్ సీజన్ (2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున ఆడాడు. అయితే, ఇటీవల జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కేకేఆర్ ఫ్రాంఛైజీ మొయిన్ అలీని విడుదల చేసింది. గత సీజన్‌లో ఆయన కేవలం 6 మ్యాచ్‌లు ఆడి, 5 పరుగులు మాత్రమే చేసి, 6 వికెట్లు తీశారు. పేలవమైన ప్రదర్శన కారణంగానే కేకేఆర్ ఆయనను రిటైన్ చేసుకోలేదని సమాచారం. ఫ్రాంచైజీ విడుదల చేయడంతో మనస్తాపం చెంది, ఐపీఎల్‌కు మొత్తానికే గుడ్‌బై చెప్పి, తదుపరి సీజన్ వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
మొయిన్ అలీ ఐపీఎల్ కెరీర్: 38 ఏళ్ల మొయిన్ అలీ 2018 నుండి ఐపీఎల్‌లో నిలకడగా ఆడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 73 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆయన 1167 పరుగులు చేసి, 41 వికెట్లు పడగొట్టారు.
మొయిన్ అలీ నిర్ణయం ఐపీఎల్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఆయన భవిష్యత్తులో ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కాగా, మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు 2024 సెప్టెంబర్‌లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
