
D Spiritual: Nov 28: అయ్యప్ప స్వామి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామివారి ప్రధాన ప్రసాదాన్ని అరవణ పాయసం అని అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లం కలిపి తయారయ్యే ఈ అరవణ పాయసం ఎన్నో పోషక పదార్థాలను కలిగి ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాలను ధరించే భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. మాలను ధరించలేని వారు కూడా కేరళలోని శబరిమల వెళ్లి హరిహరపుత్రుడ్ని దర్శించుకుంటారు. అయ్యప్ప దర్శనం తర్వాత అక్కడ లభించే ప్రసాదాన్ని తీసుకుని వచ్చి బంధుమిత్రులకు పంచడం భక్తులు సాధారణంగా చేసే ఆచారం. తిరుపతి లడ్డూ, అన్నవరం ప్రసాదం తర్వాత ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ప్రసాదం శబరిమల అరవణి పాయసమే. బెల్లం, బియ్యం, నెయ్యి కలగలిపి తయారు చేసే ఈ ప్రసాదం రుచికరంగా ఉండడమే కాకుండా శరీరానికి అనేక లాభాలు కూడా ఇస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు. కేరళలో పూజలు మరియు పర్వదినాల్లో ఈ పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది.
అరవణ పాయసం తయారీలో అవసరమయ్యే పదార్థాలు: ఒక కప్పు ఎర్రబియ్యం, రెండు కప్పుల నల్ల బెల్లం, తగినంత నెయ్యి, రెండు టీ స్పూన్ల జీడిపప్పు, ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, రెండు టీ స్పూన్ల శొంఠి పొడి, ఆరు కప్పుల నీరు. ముందుగా నల్ల బెల్లాన్ని తురిమి కరిగించాలి. మరో పాత్రలో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టాలి. ఎర్రబియ్యాన్ని అన్నంలా మెత్తగా ఉడికించాలి. రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి కలిపితే రుచి పెరుగుతుంది. బియ్యం ఉడికిన తర్వాత అందులో కరిగిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. తరువాత శొంఠి పొడి వేసి, నెయ్యి కూడా జోడించి కొద్దిసేపు మరిగించాలి. మరిగే సమయంలో పాయసం పైకి బుడగలు వస్తే స్టౌ ఆఫ్ చేసి, ముందుగా వేయించిన జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇలా రుచికరమైన శబరిమల అరవణ పాయసం సిద్ధమవుతుంది.
