
D Spiritual: Nov 28: శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని చాలా మంది ప్రత్యేక నియమాలు పాటిస్తారు. ఈ నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. అయితే కొంతమంది తెలియకపోయినా, అజాగ్రత్తగా శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులు శుక్రవారం రోజున అసలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ పనులు ఏమిటో చూద్దాం.
మొదటగా, శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదా ఫొటోను ఇంటి దేవుడి గదిలోంచి బయటకు తీసి వేయకూడదు. కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి కొత్తవి ఉంచుతారు. కానీ ఈ నిమజ్జనం శుక్రవారం రోజున చేయకూడదు. పాత విగ్రహాన్ని తీసేయాలంటే గురువారం లేదా ఇతర రోజున చేయాలి. అయితే కొత్త విగ్రహాన్ని శుక్రవారం ఉంచుకోవడంలో ఎలాంటి తేడా లేదు.
శుక్రవారం రోజున రుణాలు తీసుకోవడం, ఇవ్వడం కూడా నివారించాలి. ఎవరికి సహాయం అవసరం అయితే చేయాలి కానీ అప్పు రూపంలో ఇచ్చిపుచ్చుకోవడం మంచిది కాదు. ఈ రోజు చాలా మంది వైభవ లక్ష్మీ వ్రతం పాటిస్తారు, అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే శుక్రవారం రోజున అమ్మాయిలపై కోపపడడం, తిట్టడం లేదా హింసించడం వంటి పనులు అస్సలు చేయరాదు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిని గౌరవంగా ప్రవర్తించాలి.
అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఇంటికి తీసుకురావచ్చు కానీ బయటికి పంపకూడదు. పొరపాటున కూడా అమ్మవారి విగ్రహం శుక్రవారం ఇంటి గడప దాటకూడదు. ఈ రోజున ఇంట్లో బూజు దులపడం, చెత్త పనులు చేయడం కూడా అనవసరం.
శుక్రవారం రోజున మగవారు, ఆడవారు ఇద్దరూ జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని నమ్మకం. అలాగే వేసుకున్న బట్టలు మాసిపోయినవి, మురికిగా ఉన్నవి అయితే ధరించరాదు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం కూడా శుక్రవారం నివారించాలి.
