
DNews: Nov 28: హైదరాబాద్ నగరంలో ఉపనగర కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసే నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు తదుపరి చర్యలపై దృష్టి సారిస్తున్నాయి. విలీనం పూర్తయిన తర్వాతే కార్పొరేషన్ల విభజన, డివిజన్ల పునర్విభజన ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల మ్యాపులు, జనాభా, వార్డుల సంఖ్య, ఓటర్ల వివరాలు తదితర సమాచారాన్ని మున్సిపల్ శాఖ ఇప్పటికే సేకరించింది. కార్పొరేషన్ల ఏర్పాటు, ఎదురయ్యే కష్టాలు, ఇతర అంశాలపై అధ్యయనం చేయడానికి బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించారు. ఈ నివేదిక ఆధారంగా ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, అవి ఎలా ఉండాలి అనే అంశాలపై ప్రాథమిక అంచనా వేసినట్లు సమాచారం.
బాల్దియా వర్గాల ప్రకారం, ఈ విభజన ప్రక్రియ ఫిబ్రవరి 10 తర్వాతే జరుగుతుంది. CGG ఇచ్చిన నివేదికతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

మెగా GHMC ప్రస్తుత బాల్దియా పరిధి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉండనుంది. 2,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ ప్రాంతంలో మెరుగైన పౌరసేవలు, మౌలిక వసతులు అందించడంలో, అలాగే పరిపాలనా వ్యవహారాల్లో కొన్ని కష్టాలు ఎదురవుతాయని పట్టణ ప్రణాళికకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఒకే కార్పొరేషన్‌గా కాకుండా, ప్రభుత్వం దీన్ని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియలో ఆర్థిక వనరులు, మౌలిక వసతులు, జనాభా సమతుల్యతను కాపాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే భౌగోళిక లేదా సరిహద్దు సమస్యలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిని ఆధారంగా చేసుకుని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియలో స్థానికంగా ఆస్తి పన్ను, భవన అనుమతులు మరియు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పన్నులు ఎక్కువగా వసూలు చేసే ప్రాంతాలు, పన్నులు తక్కువగా వసూలు చేసే ప్రాంతాలు ఒకే కార్పొరేషన్ పరిధిలో ఉండేలా చూడాలని పట్టణ ప్రణాళికకర్తలు సూచిస్తున్నారు, తద్వారా అభివృద్ధిలో అసమానతలు రాకుండా ఉంటుంది.

బాల్దియా గవర్నింగ్ కౌన్సిల్ పదవీకాలం ఫిబ్రవరి 10 వరకు మాత్రమే ఉంది. ఉపనగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో GHMC చట్టాలు, మున్సిపల్ చట్టాల ప్రకారం తక్షణ విలీనంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. బాల్దియాకు సంబంధించిన ఏ అంశంపైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది.
ఇటీవల కౌన్సిల్ ప్రభుత్వం సూచించిన విలీనం ప్రతిపాదనపై అధ్యయనం చేసి అభిప్రాయం ఇవ్వాలని ఆమోదించింది. ఈ క్రమంలో బాల్దియా, ప్రస్తుత 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేటర్ పరిధిలో జనాభా, డివిజన్లు, మౌలిక వసతులు, భౌగోళిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు మొదలైన అంశాలను అధ్యయనం చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)కు బాధ్యతలు అప్పగించింది. విలీనం వల్ల కలిగే లాభాలు, ఎదురయ్యే కష్టాలు, ఏ ప్రతిపాదన ఆధారంగా డివిజన్లను పునర్విభజించాలి అనే అంశాలపై CGG నివేదిక సమర్పించనుంది. బాల్దియా ఈ నివేదికను ప్రభుత్వానికి పంపనుంది.
