
D Spiritual: Nov 27: ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం అయిన శ్రీ వాసవి మాత జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను ఇకపై వాసవి పెనుగొండగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన వినతులను సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసమితితో కలిసి సమీక్షించారు. ఆర్యవైశ్యుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పెనుగొండ పేరును వాసవి పెనుగొండగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలోనే ముఖ్యమంత్రి ఈ విషయంపై హామీ ఇచ్చినందున, తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ నామకరణం సందర్భంగా వాసవి ధాంలో కలిసి సంబరాలు జరుపుకుందామని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్టు చైర్మన్ గోవిందరాజులు వెల్లడించారు. అలాగే ఈ మార్పు కోసం కృషి చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు.
పెనుగొండ క్షేత్ర చరిత్ర ప్రకారం, పూర్వం అక్కడ కుసుమశ్రేష్టి అనే ధనవంతుడు, ధార్మికుడు నివసించేవాడు. ఆయన భార్య కౌసుంబి సంతానలేమితో బాధపడుతుండగా, కుసుమశ్రేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగంతో ప్రసన్నమైన ఉమామహేశ్వరి దేవి హోమగుండం నుంచి ప్రత్యక్షమై రెండు ఫలములు ఇచ్చి వాటిని భుజించాలని ఆదేశించింది. ఫలితంగా కౌసుంబి పది నెలలకు కవలలను — ఒక ఆడబిడ్డను, ఒక మగబిడ్డను — ప్రసవించింది. జ్యోతిష్యులు ఆ ఆడశిశువుకు ఉమామహేశ్వరి అంశం ఉండడంతో వాసవి, మగశిశువుకు విష్ణు అంశం ఉండడంతో విరూపాక్షుడు అనే పేర్లు పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు వారిని సద్గుణాలతో పెంచి యుక్తవయసుకు చేర్చారు.
ఇదే సమయంలో ఉత్తరాది నుంచి విజయయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న రాజు విష్ణువర్ధనుడు పెనుగొండకు చేరుకున్నాడు. అక్కడ అపురూప సౌందర్యంతో నిలిచిన వాసవిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని పట్టుదలపడ్డాడు. తన మంత్రిని పంపి కుసుమశ్రేష్టికి ఈ విషయం తెలియజేయగా, కులభేదం కారణంగా ఆయన నిరాకరించాడు. దీనితో రాజు కోపంతో, అంగీకరించకపోతే గాంధర్వ వివాహం చేసుకుంటానని హెచ్చరించాడు. రాజు బెదిరింపుతో ఊరి ప్రజలలో భయం మొదలైంది.
రాజు సైన్యంతో పెనుగొండకు వస్తున్నాడు అన్న వార్తతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పరిస్థితిని సమీక్షించిన పెద్దలు, వాసవి అగ్నిప్రవేశం చేస్తేనే ఈ వివాహం నిలుస్తుందని నిర్ణయించారు. తండ్రి అభ్యర్థనపై వాసవి, తాను అంబికా అంశమై జన్మించాను కాబట్టి మానవుడిని వివాహం చేసుకోను, అగ్నిప్రవేశానికి సిద్దమని చెప్పింది. తల్లిదండ్రులతో పాటు మూడు ప్రదక్షిణలు చేసి ప్రజలతో కలిసి అగ్నిలోకి దూకింది. అగ్నిజ్వాలలు ఆమెను తాకలేక శాంతించగా, వాసవి విశ్వరూపాన్ని చూపి వైశ్యుల కులదైవమవుతానని, తనని ఆరాధించే వారు అష్టైశ్వర్యాలు పొందుతారని, అగ్నిలో ఆత్మాహుతి చేసినవారు మోక్షం పొందుతారని ప్రకటించింది.
ఇంతలో విష్ణువర్ధనుడు నగరంలోకి ప్రవేశించగా, వాసవి అగ్నిప్రవేశం చేసిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాడు. అదే సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై అతన్ని సంహరించింది. తన తండ్రి మరణము తెలుసుకున్న రాజరాజనరేందడు విచారంతో వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష అడిగి, విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.
వాసవి ఆజ్ఞప్రకారం పెనుగొండ ప్రజలు ఆలయాన్ని నిర్మించి, ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం గోపురం అద్భుతమైన శిల్పకళా కౌశలంతో నిర్మించబడింది. ఆలయంలోకి ప్రవేశించగానే నందులు, ధ్వజస్తంభం, నాగవిగ్రహం దర్శనమిస్తాయి. ప్రాకారంలో ప్రదక్షిణలు చేసి వస్తే వినాయకుడు, నవగ్రహాలు, తర్వాత వెంకటేశ్వరస్వామి సన్నిధి కనిపిస్తాయి. ఆలయం లోపల మూడు గర్భగుడులు వరుసగా ఉన్నాయి — ఈశ్వరుడు, మహిషాసురమర్ధిని, వాసవి దేవి. వాసవి విగ్రహం చిలుక, వీణ, తామరపువ్వు, పాశాలతో అలంకరించబడింది. వందనీయమైన త్యాగమూర్తిగా, వైశ్యుల కులగౌరవాన్ని కాపాడిన దేవిగా వాసవి దేవి ప్రసిద్ధి చెందింది.
