
కార్తీకమాసం సందర్భంలో శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి మల్లికార్జున, అమ్మవారు బ్రమరాంబలకు భక్తులు బంగారం, వెండి, నగదు రూపంలో కానుకలు సమర్పించారు. కొందరు విదేశీ కరెన్సీలను కూడా హుండీలో వేశారు. ఈ కారణంగా గత సంవత్సరం కార్తీకమాసంతో పోలిస్తే ఈ ఏడాది హుండీ ఆదాయం భారీగా పెరిగింది.
కార్తీకమాసం కావడంతో శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ అధికమైంది. దీంతో స్వామి–అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. తాజాగా చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం ₹7,27,26,400 ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. ఇది గత 33 రోజుల్లో భక్తులు సమర్పించిన నగదు అని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
గత ఏడాది కార్తీకమాసంతో పోల్చితే ఈసారి సుమారు ₹1,30,34,024 అధికంగా కానుకలు వచ్చినట్లు ఈవో వివరించారు. భారతీయ రూపాయలతో పాటు విదేశీ కరెన్సీ కూడా పెద్ద సంఖ్యలో సమర్పించబడింది. USA డాలర్లు 646, సౌదీ రియాల్స్ 85, యూఏఈ దిర్హమ్స్ 120, కతార్ రియాల్స్ 136, సింగపూర్ డాలర్లు 30, ఇంగ్లాండ్ పౌండ్స్ 85, ఆస్ట్రేలియా డాలర్లు 25, ఒమన్ బైంసా 200లను భక్తులు హుండీలో వేశారు.
ఇతర కానుకలలో 117.800 గ్రాముల బంగారం, 7 కిలోలు 230 గ్రాముల వెండి కూడా ఉన్నాయి. ఇవన్నీ భక్తులు స్వామి–అమ్మవార్లకు పవిత్ర కానుకలుగా సమర్పించినవే. పటిష్ఠ నిఘా మధ్య ఈవో శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ లెక్కింపులో దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శివసేవకులు పాల్గొన్నారు.
