
D Spiritual: Nov 26: అష్టాదశ శక్తి పీఠాలు గురించి మీరు వినే ఉంటారు. వాటిలో కొన్ని చూసి కూడా ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయి. వాటిని ఏటా చాలామంది దర్శనం చేసుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూజలందుకుంటున్న అమ్మవారి శక్తి పీఠాలు ఏవి అని ఈ స్టోరీలో తెలుసుకుందాం. దక్షయజ్ఞంలో అగ్నిలో దూకిన సతీదేవి శరీరాన్ని చేతుల్లో పట్టుకొని విలపిస్తూ పరమశివుడు భారత ఖండం అంతా తిరిగినప్పుడు ఆమె శరీర భాగాలు పడిన చోట్లే శక్తి పీఠాలు వెలిశాయి. మొత్తం 108 ఉన్నా, ముఖ్యమైనవి 18. వాటిలో నాలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.
భ్రమరాంబిక ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో, ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి, ఇక్కడే శివానంద లహరిని రచించారని చెబుతారు.
పురుహూతిక దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే కనపడే పాదగయ సరోవరం ఎంతో పవిత్రం. ఇక్కడ పితృదేవతల పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
మాణిక్యాంబ దేవి ఆలయం కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ద్రాక్షారామం ఐదు ఆరామాలలో ఒకటి. మిగిలినవి కుమారరామ, క్షీరారామ, భీమారామ, అమరారామ.
తెలుగు రాష్ట్రాల్లోని మరో శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం. ఇది తెలంగాణాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు పాత దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పటికీ, అమ్మవారి రెండు శక్తులు అయిన చండి, ముండి విగ్రహాలు మాత్రం రక్షించబడ్డాయి.
