
DET:NOV 22:
గోవాలో ఘనంగా IFFI 2025 ప్రారంభం:
గోవా వేదికగా 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ ప్రపంచంలో ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించే ఈ వేడుక నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. ఈసారి ఎప్పటిలా కాకుండా, తొలిసారిగా స్ట్రీట్ కార్నివాల్ రూపంలో ఒక గ్రాండ్ ఓపెనింగ్ పరేడ్‌తో ఉత్సవాలను మొదలుపెట్టారు. ఈ పరేడ్ కోసం గోవా వీధులు రంగులమయంగా మారాయి. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ కేంద్ర మంత్రులు ఈ పండుగను ప్రారంభించారు. ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి ప్రముఖ సినీ ప్రముఖులు తరలివచ్చారు.
నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం:
తెలుగు సినీ పరిశ్రమ గర్వించే విషయం ఏమిటంటే, ఈ ప్రారంభ వేడుకలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి అరుదైన సన్మానం దక్కింది. నటుడిగా ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను ఈ గౌరవం ప్రకటించారు. బాలకృష్ణకు గోవా గవర్నర్ మరియు కేంద్ర మంత్రులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చూపిన స్వాగ్ ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
అనుపమ్ ఖేర్, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణ:
ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ యువ కథానాయిక శ్రీలీల హాజరయ్యారు. ఈ స్టార్స్ అందరూ కలిసి పరేడ్‌లో సందడి చేశారు. అనుపమ్ ఖేర్ నటించిన నాలుగు సినిమాలు ఈ IFFIలో ప్రదర్శితం కావడం విశేషం. వాటిలో తన్వి ది గ్రేట్ ఇండియన్ పనోరమా విభాగంలో ఉంది. అలాగే, శ్రీలీల రాకతో తెలుగు యువ తరం ప్రతిభకు ప్రాధాన్యత లభించినట్లైంది. వీరిద్దరూ వేడుకలో ఉల్లాసంగా కనిపించి, ప్రేక్షకులను పలకరించారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక నివాళి
ఈ పరేడ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రత్యేకంగా నివాళి అర్పించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వారి సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. ఆంధ్రప్రదేశ్, హర్యానా, గోవా రాష్ట్రాల కళారూపాలతో ఏర్పాటు చేసిన భారీ శకటాలు ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా, పలు సినీ నిర్మాణ సంస్థలు మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా తెలుగు సినీ పరిశ్రమకు అంకితమిస్తూ ప్రత్యేకంగా శకటాలను ప్రదర్శించాయి. ఇది తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మరోసారి పెంచింది.
