
D Spiritual: Nov 18: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే, ఏడాది పాటు పూజలు చేయకూడదని, ఆలయాలకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. అలాగే ఆ ఇంట్లో శుభకార్యాలు కూడా చేయరాదని సలహా ఇస్తుంటారు. ఈ కారణంగా మరణం సంభవించిన ఇంటిలో పూజా కార్యక్రమాలను నిలిపివేసి, పూజా సామగ్రిని కూడా పక్కన పెట్టేస్తారు. అందుకే చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది — ఇంట్లో మరణం జరిగిన తర్వాత పూజలు చేయాలా? వద్దా? ఏమంటుంది శాస్త్రం?
శాస్త్రం ప్రకారం ఇంట్లో నిత్యం దీపారాధన చేసే ఇళ్లలో దేవతలు సంచరిస్తారని చెప్పబడింది. ప్రతిరోజూ దీపం వెలిగించడం, పూజలు చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంపద, సుఖసంతోషాలు నెలకొంటాయని గ్రంథాలు సూచిస్తాయి. ఇక మరణం జరిగిందని ఏడాది పాటు పూజలు చేయకూడదన్న నియమం శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇది పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే.
శాస్త్ర ప్రకారం, ఇంట్లో మరణం సంభవించినప్పుడు కేవలం 11 రోజుల పాటు మాత్రమే పూజలు చేయకూడదు. ఈ 11 రోజులు ‘అశౌచం’గా పరిగణించబడతాయి. 11 రోజుల తర్వాత ఇంటిని శుభ్రం చేసి, యథావిధిగా పూజలు ప్రారంభించవచ్చు. దీపారాధన, నిత్య పూజలు, దేవాలయ దర్శనాలు చేయడం పూర్తిగా శాస్త్రోక్తమే.
అయితే 11 రోజుల తర్వాత పూజలు చేయవచ్చుకానీ, ఆ ఇంట్లో పెళ్లిళ్లు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు మాత్రం చేయరాదు. అలాంటి శుభకార్యాలను కొంతకాలం తర్వాత నిర్వహించడం శాస్త్రం సూచిస్తుంది. మిగతా నిత్య పూజలు మాత్రం ఆరంభించడంలో ఎలాంటి అపచారం లేదని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది.
