
D Spiritual: Nov 18: భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆరు రాహు–కేతు దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఉన్న దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయని వేలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి ప్రజలు తరలివస్తుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు–కేతు పూజలు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. జాతకంలో రాహు, కేతు గ్రహాలు బలహీనంగా ఉన్నా లేదా ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు రాహు కేతు దోషం ఏర్పడుతుందని నమ్మకం. దీని వల్ల వివాహం ఆలస్యం కావడం, అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తారు. ఇవి నివారించడానికి రాహు–కేతు శాంతి పూజలు ప్రాధాన్యత పొందాయి.
1. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం – శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి. పంచభూత లింగాలలో వాయు లింగం ఇక్కడ కొలుస్తారు. ఈ ఆలయాన్ని రాహు–కేతు క్షేత్రంగా కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడి నవగ్రహ కవచం కారణంగా రాహు, కేతు సహా అన్ని గ్రహాలపై పరమేశ్వరుని అధిపత్యం ఉంటుందని నమ్మకం.
ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ‘ప్రాణవంతమైన లింగం’ అని పిలుస్తారు. ఎందుకంటే గర్భగుడి లోని అన్ని దీపాలు నిశ్చలంగా ఉండగా, శివలింగం ఎదుట ఉండే అఖండజ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగ స్వభావం వల్లే ఇది జరిగుతుందని భక్తులు భావిస్తారు.
2. తిరునాగేశ్వరం నాగనాథర్ ఆలయం – తమిళనాడు
కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం ఆలయం రాహు క్షేత్రంగా విశేష ఖ్యాతి పొందింది. ఇక్కడ నాగనాథర్ స్వామితో పాటు పార్వతీ దేవి పిరయైని, గిరికుచాంబిక రూపాల్లో దర్శనమిస్తారు. ఇక్కడి ప్రత్యేకత రాహువు మానవ ముఖంతో దర్శనమివ్వడం.
అత్యంత ఆశ్చర్యకర విశేషం ఏమిటంటే– రాహుకాలంలో శివలింగంపై పాలు పోస్తే అవి నీలం రంగులోకి మారుతాయి. నేలను తాకే సరికి మళ్లీ తెల్లగా మారిపోతాయి. ఈ అద్భుతాన్ని చూడటానికే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. చోళుల కాలం నాటి నిర్మాణ శైలి, శిల్పాలు ఆలయాన్ని మరింత అందంగా నిలబెట్టాయి.
3. శ్రీ నాగనాథస్వామి కేతు దేవాలయం – కీజాపెరుంపల్లం, తమిళనాడు
పూంపుహార్ సమీపంలోని ఈ దేవాలయం కేతువుకు ప్రసిద్ధ స్థలం. ఇది నవగ్రహాల ప్రత్యేక ఆలయాలలో ఒకటి. కేతు దోషం తొలగించడానికి, జ్ఞానం, శ్రేయస్సు, అడ్డంకుల నివారణ కోసం భక్తులు ఇక్కడ విశేష పూజలు జరిపిస్తారు.
రాజగోపురం, రెండు ప్రాకారాలతో ఉన్న ఈ ఆలయంలో రోజుకు నాలుగు సార్లు పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి, తిరువాదిరై వంటి పండుగల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
4. రాహు–కేతు దేవాలయం – వరదవెల్లి, తెలంగాణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ పురాతన (సుమారు 500 ఏళ్ల నాటి) రాహు–కేతు దేవాలయం చాలా విశేషం. వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వయంభువుగా రాహు–కేతు సర్ప శయనం ఉన్నట్లు చెబుతారు. ప్రతి ఆదివారం, గురువారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.
దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కేవలం 20 నిమిషాల దూరంలో ఉండటంతో, భక్తులు రెండూ క్షేత్రాలను కలిసి దర్శించుకుంటారు.
5. శ్రీ నీలకంఠేశ్వర ఆలయం – గెరుగంబాక్కం, చెన్నై
చెన్నై సమీపంలోని గెరుగంబాక్కంలో ఉన్న ఈ ఆలయం కేతు పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి, ఆది కామాక్షి అమ్మవారు ప్రధాన దైవాలు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కేతు మందిరం కూడా ఉంది.
కేతు దోషాలు, జీవన అడ్డంకులు, ఆర్థిక సమస్యలు నివారించడానికి భక్తులు ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు చేయిస్తారు. కుటుంబ సామరస్యాన్ని కోరుకునే వారు కూడా ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు.
6. రాహు ఆలయం – పైథాని, ఉత్తరాఖండ్
ఉత్తర భారత్‌లో ఏకైక రాహు దేవాలయం ఇదే. పౌరిలోని పైథాని గ్రామంలో సయోలిగాడ్ నది సంగమంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ రాహువుతో పాటు శివలింగం కూడా పూజలందుకుంటుంది.
పురాణం ప్రకారం, శ్రీ మహావిష్ణువు రాహువు తలను నరికిన తర్వాత ఆ శిరస్సును ఇక్కడ రాళ్ల కింద పాతిపెట్టాడట. దీని కారణంగానే ఈ ప్రదేశం రాహు దోష నివారణకు అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు.
