
D Spiritual : Nov 17: ఇల్లు నిర్మించుకోవడం అనేది ఎంతో మందికి జీవితంలో ఒక పెద్ద కల. ఈ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి, అందులో భూమి పూజ ఒక ముఖ్యమైన ఘట్టం. ఇల్లు కట్టడం అనేది సాధారణ పని కాదు కాబట్టి పెద్దలు “ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు” అని చెప్పడం సహజం. భూమి పూజ సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పునాది తీసే సమయంలో అందులో కొన్ని పవిత్ర వస్తువులను వేయడం సంప్రదాయం. ఈ వస్తువులు ఇంటి శ్రేయస్సు, స్థిరత్వం, సంపద కోసం ప్రతీకలు గా భావిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఒకవేళ ఈ నియమాలు పాటించకపోతే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ప్రతికూల ఫలితాలు రావచ్చు. అందుకే పునాది వేసే సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పునాది బలంగా ఉండడం వల్ల ఇంటి స్థిరత్వం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం ఉంది. అందుకే పునాదిలో వాస్తు ప్రకారం ప్రత్యేక వస్తువులను వేయాలని సూచిస్తారు.
పునాదిలో వెండి పాముల జతను ఉంచడం వల్ల ఇంటి రక్షణ కలుగుతుందని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. అదేవిధంగా రాగి ప్రాతపై గంగాజలం, పసుపు, కుంకుమ, పువ్వులు, నాణేలు ఉంచి పునాదిలో వేస్తారు. దీనివల్ల లక్ష్మీదేవి, విష్ణుదేవుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అదనంగా పసుపు ముద్ద, తమలపాకులు, నాలుగు ఇనుప మేకులు, తులసి, ఐదు రత్నాలు, ఐదు లోహాలు వేయడం ఇంటి శ్రేయస్సు, సంపద కోసం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
పునాది ఎప్పుడూ ఈశాన్య దిశలో ప్రారంభించడం శుభప్రదం. భూమి పూజను తూర్పు వైపు తిరిగి చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ విధంగా వాస్తు నియమాలను పాటిస్తూ భూమి పూజ చేస్తే కొత్త ఇంటికి శాంతి, సంపద, సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం.
