
DNews:14 NOV:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అద్భుతమైన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఈ గ్రాండ్ విక్టరీతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బలపరుచుకుంది. ఈ విజయంపై కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన చేయనుంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ సాధించిన ఈ రికార్డు స్థాయి విజయంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయి, డప్పులు వాయిస్తూ, బాణాసంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. వారు “రప్పా రప్పా, తగ్గేదేలే” అంటూ నినాదాలు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోయాయి. అదే విధంగా, యూసఫ్‌గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం మరియు కార్యాలయంలోనూ విజయోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
