DET:NOV 13:
ది గర్ల్‌ఫ్రెండ్‌ చూసి చప్పట్లు కొట్టా:
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల విడుదలైన రష్మిక మందన్న సినిమా ది గర్ల్‌ఫ్రెండ్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు.చాలా కాలం తర్వాత ఒక సినిమాకు మనస్పూర్తిగా చప్పట్లు కొట్టానని ఆయన తెలిపారు.రష్మిక నటన అద్భుతంగా ఉందని,ఆమెకు జాతీయ అవార్డు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

రష్మిక నటనలో ఆ అమాయకత్వం:
దేవిశ్రీ ప్రసాద్ తన పోస్ట్‌లో రష్మికను ఉద్దేశించి,రష్మికా,నువ్వు కేవలం నేషనల్ క్రష్ మాత్రమే కాదు.ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాకు నీకు జాతీయ అవార్డు రావాలి అని పేర్కొన్నారు.పుష్ప,యానిమల్,చావా,కుబేర వంటి విభిన్నమైన సినిమాలలో నటించి మెప్పించిన తర్వాత,ఈ సినిమాలో ఆ అమాయకత్వాన్ని చాలా సులభంగా,నమ్మశక్యంగా ఎలా తీసుకురాగలిగావు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నీవు ఆ పాత్రలో జీవించేశావు.ప్రతి ఎక్స్‌ప్రెషన్‌లో ఉన్న లోతు మనసును కదిలించేలా ఉంది అని ప్రశంసించారు.ప్రతి అమ్మాయి,అబ్బాయి తప్పకుండా ఈ సినిమా చూడాలని ఆయన అన్నారు.

దర్శకుడికి,టీమ్‌కు ప్రశంసలు:
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను కూడా అభినందించారు.రాహుల్ సార్,ఇంత సున్నితమైన కథను ఇంత అద్భుతంగా ఎలా హ్యాండిల్ చేయగలిగారు? మీకు నా వందనాలు!అని తెలిపారు.అలాగే,ఈ అందమైన ఎమోషన్‌ను అందించిన నిర్మాతలకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు.ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన దీక్షిత్ శెట్టి,అను ఇమ్మాన్యుయేల్ల నటనను కూడా దేవిశ్రీ ప్రసాద్ మెచ్చుకున్నారు.సాంకేతిక నిపుణులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.