
DET:NOV 13:
ఆలియా పెళ్లికి ఆహ్వానం అందక బాధపడ్డా: ముకేశ్ భట్
సినీ నిర్మాత ముకేశ్ భట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మేనకోడలు ఆలియా భట్,రణబీర్ కపూర్ వివాహానికి తనని ఆహ్వానించకపోవడం గురించి ఎమోషనల్ అయ్యారు.విశేష్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడైన ముకేశ్ భట్,తన అన్నయ్య మహేశ్ భట్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ కారణంగానే ఆలియా పెళ్లికి కూడా ఆహ్వానం అందలేదని పరోక్షంగా తెలుస్తోంది.
ఆలియా పెళ్లి గురించి మాట్లాడుతూ ముకేశ్ భట్,నాకు బాధ కలగలేదని చెబితే అది అబద్ధం అవుతుంది.నిజంగా బాధ అనిపించింది.నేను ఆలియాను,షాహీన్‌ను చాలా ప్రేమిస్తాను.అందుకే ఆలియా పెళ్లి అయినప్పుడు,నా కూతురి పెళ్లి అనిపించింది.అక్కడ ఉండాలని నేను చాలా కోరుకున్నాను అని తన మనసులోని మాటలను పంచుకున్నారు.
మనవరాలు రాహాను చూడాలని ఆరాటం: నా కళ్లు తపించిపోతున్నాయి
పెళ్లి గురించే కాకుండా,ఆలియా-రణబీర్‌ల ముద్దుల కూతురు రాహా కపూర్ గురించి కూడా ముకేశ్ భట్ ఎంతో ఆవేదనతో మాట్లాడారు.ఆయన ఇంకా రాహాను కలవలేదని చెప్పారు.ఆలియా గర్భవతి అని,ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసినప్పుడు,రాహాను చూడాలని నా కళ్లు తపించిపోయాయి.నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని భావోద్వేగంతో వెల్లడించారు.
ఇబ్బంది పెట్టదల్చుకోలేదు,అందుకే దూరం:
మరి ఆలియాను కలవడానికి మీరు ప్రయత్నించలేదా అని అడగ్గా,ముకేశ్ భట్ ఇలా అన్నారు: నేను ఆమెను ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టదలుచుకోలేదు,అందుకే ప్రయత్నించలేదు.నేను ఆమెకు మెసేజ్ కూడా చేయలేదు. కానీ,మనస్ఫూర్తిగా దీవించాను అని ముగించారు.
