
D Spiritual: Nov 13: వేణు స్వామి ప్రముఖ ఆస్ట్రాలజర్. ఈయన ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా, వివాదాస్పద (కాంట్రవర్సీ) విషయాల కారణంగా ఆయన తరచూ చర్చనీయాంశం అవుతుంటారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ట్రోల్స్‌కు గురైనప్పటికీ, ఎప్పటికప్పుడు మళ్ళీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూనే ఉంటారు. అదే సమయంలో, ఆయన చేసే పూజలు కూడా తరచూ వివాదాస్పదంగా మారుతుంటాయి.
సంతానం లేనివారు ప్రముఖ కామాఖ్య ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు, అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలని ఆయన అనడం, కామాఖ్య ఆలయ అర్చకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే వేణు స్వామిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు.
తాజాగా, వేణు స్వామి మరోసారి తన పూజలతో వార్తల్లో నిలిచారు. ఈయన వటుక భైరవ పేరుతో పూజలు నిర్వహించారు. ఈ పూజలో స్వామి వారికి మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత వాటన్నింటినీ హోమంలో వేసి ఆహుతి ఇచ్చారు. ఈ వటుక భైరవ పూజ గురించి వేణు స్వామి మాట్లాడుతూ, ఈ పూజ ఎవరి పేరు మీదైతే చేస్తామో వారికి కోర్టు వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, డబ్బు పరంగానూ విజయం సిద్ధిస్తుందని అన్నారు. అలాగే శత్రువుల పీడ కూడా విరగడవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, ఈ వటుక భైరవ పూజా కార్యక్రమంలో తప్పకుండా స్వామి వారికి మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించాలని వేణు స్వామి తెలిపారు. అంతేకాకుండా, ఈ పూజా ఫలితం దక్కాలంటే పూజ చివరిలో నీటి మీద తేలియాడుతూ వటుక భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలని అన్నారు. అందుకు తగ్గట్టుగానే, పూజ అనంతరం తన ఫామ్ హౌస్‌లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిపై తేలియాడుతూ వటుక భైరవ మంత్రాలను జపించారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తూ, హోమంలో మద్యం, మాంసం వేయడం పట్ల ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.
