
D Spiritual: Nov 6: శివోహం… కార్తీక మాస ప్రాముఖ్యత
శివోహం… కార్తీకం వచ్చిందంటే చాలు, అంతటా శివనామస్మరణ జరుగుతుంది. ఈ మాసంలో శివార్చన, అభిషేకం అత్యంత విశేష ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో నియమాలు పాటించి శివపూజ, అభిషేకం చేసుకోలేని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
శివమానస పూజ ప్రాముఖ్యత
అయితే వీరందరూ శివమానస పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం… శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు.
పూజ చేయలేని పరిస్థితులు
వృద్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేకపోయినా, చెయ్యాలనే తపన మాత్రమున్నవాళ్లు మరి ఏం చెయ్యాలి? ధర్మ గ్రంథాలు ఏం చెబుతున్నాయి?
మానసిక పూజ యొక్క శాస్త్రీయత
అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమైనది. మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా ఉండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి. అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి.
మానసిక పూజ విధానం
అది ఎలా చెయ్యాలి? భగవంతుడు అక్కడ ఉన్నాడని భావించి ఆయనకు రత్న సింహాసనం వెయ్యాలి. ఆకాశ గంగను తెచ్చి మనసారా అభిషేకించాలి. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి. సుగంధభరితమైన పూలతో, మారేడ దళాలతో పూజించాలి. ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. షడ్రసోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి.
భగవంతుని ప్రార్థన
“స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నన్ను దయచూడమని” వేడుకోవాలి. బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా, భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు.
మానస పూజ ఫలితాలు
శివమానస పూజ వల్ల విశేష ఫలితాలు వస్తాయి. శివానుగ్రహం లభిస్తుంది.
