
D Spiritual: Nov 4: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ స్వామి వారి ప్రసాదంగా వివిధ రకాల ఆహార పదార్థాలను లేదా పండ్లను భక్తులకు ఇస్తూ ఉంటారు. కానీ కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య ఆలయానికి వెళితే, అక్కడ స్వామి వారి ప్రసాదంగా పుట్టమట్టిని భక్తులకు ఇస్తారు. దీనినే మృత్తికా ప్రసాదం అని పిలుస్తారు.
భక్తులకు ఇచ్చే ఈ పుట్టమట్టిని మృత్తికా ప్రసాదం అంటారు. ఈ మృత్తికా ప్రసాదాన్ని కొందరు భక్తులు నోట్లో వేసుకుంటారు. మరికొందరు ఈ ప్రసాదం తినడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. తినడానికి ఇష్టపడని వారు ఈ ప్రసాదాన్ని ఇంట్లో భద్రపరచుకుంటారు.
అదేవిధంగా ఎవరైతే పాము భయంతో ఉంటారో, అలాంటి వారు ఈ మృత్తికా ప్రసాదాన్ని నుదుటన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి భయాలు ఉండవు. అలాగే వారి కలలోకి కూడా ఎలాంటి పాములు రావని విశ్వాసం ఉంది.
ఇంకా, ఎంతో మంది యువతీ యువకులకు వివాహ వయసు వచ్చినప్పటికీ పెళ్లి జరగదు. అలాంటి వారు పెళ్లి సంబంధాల కోసం వెళుతున్న సమయంలో స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమట్టి, చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే, పెళ్లి చూపుల్లో వారికి సరైన సంబంధం దొరుకుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఇలా ఆలయంలో ఇచ్చే ఈ మృత్తికా ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా, దైవానుగ్రహంగా భావిస్తారు.
