
D Spiritual: Nov 3: హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. దీన్ని “దేవతల నెల” అని అంటారు. ఈ నెలలో భక్తులు దీపం, స్థానం, ఉపవాసం, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. పాండవులు వనవాసంలో ఈ నెలలో భగవంతుని ఆరాధించి కష్టాలను జయించారని పురాణాలు చెబుతాయి. ఈ పవిత్ర కాలంలో మాంసాహారం తినకూడదని చెప్పటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి పురాణపరమైన, ఆరోగ్యపరమైన, శాస్త్రపరమైనవి. వాటి గురించి తెలుసుకుందాం.
పురాణాల్లో కార్తీక మాసాన్ని విష్ణోప్రియమాసం అని పేర్కొన్నారు. ఈ నెలలో విష్ణుమూర్తి, శివుడు, పార్వతీదేవి, తులసి దేవి పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. భగవంతుని సన్నిధిలో హింసాత్మక ఆచారాలు చేయడం పాపంగా పరిగణించబడింది. మాంసాహారం అనేది హింసతో ముడిపడి ఉంటుంది. జంతువుని చంపడం, దాని రక్తం కార్చడం, వండడం, తినడం వంటి కార్యాలు అహింసా సూత్రానికి విరుద్ధం. పురాణాలు చెబుతున్నట్లుగా, ఒక జంతువును చంపేవాడు మాత్రమే కాదు, దాని చంపటంలో సహకరించిన, తిన్న ప్రతి ఒక్కరిపైనా సమానమైన పాపం వస్తుంది. కార్తీక మాసంలో దీపదానం, వ్రతాలు, ధ్యానం ద్వారా మనసును పవిత్రం చేసుకునే సమయంలో ఇలాంటి హింసాత్మక ఆహారం తినడం ఆధ్యాత్మిక సాధనను భంగపరుస్తుందని గ్రంథాలు హెచ్చరిస్తాయి.
