
D Spiritual: Nov 2: కార్తీక మాసం ప్రాముఖ్యత:
కార్తీక మాసం పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ పవిత్ర మాసంలో భక్తులు శివాలయాలకు వెళ్లి కార్తీక స్నానాలు ఆచరిస్తూ, కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే దీపాలు వెలిగించడం మాత్రమే కాకుండా, ఈ సమయంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అపారమైన శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో దీపాల దానం:
కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి, నదిలో లేదా చెరువులో దీపాలను వదలడం పుణ్యకార్యంగా భావిస్తారు. ఇలా నీటిలో దీపాలను వదలడం వల్ల పాపాలు తొలగి శుభం కలుగుతుందని నమ్మకం. అలాగే సూర్యోదయానికి ముందు తులసి మొక్క ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఆహారం దానం యొక్క ప్రాముఖ్యత:
హిందూ మతంలో ఆహారం దానం చేయడం అత్యంత పవిత్రమైన దానంగా పరిగణించబడుతుంది. ఆహారం దానం కంటే గొప్ప దానం మరొకటి లేదట. కాబట్టి కార్తీక మాసంలో పేదలకు వీలైనంత ఎక్కువగా ఆహారం, ఆహార పదార్థాలు, ధాన్యాలను దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. భక్తితో ఆహారాన్ని పేదలకు దానం చేయడం వల్ల ఆ వ్యక్తి పాపాలు తొలగి, ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందుతారని చెబుతారు.
ఏడు రకాల ధాన్యాల దానం:
కార్తీక మాసంలో ఏడు రకాల ధాన్యాలను దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏడు జన్మల పాటు ఆనందం, శ్రేయస్సు, సంపదను పొందుతాడని విశ్వాసం ఉంది. ఏవైనా ఏడు రకాల ధాన్యాలను ఎంచుకుని భక్తిపూర్వకంగా దానం చేయడం ద్వారా జీవితంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని చెబుతారు.
వివాహిత స్త్రీలకు కార్తీక మాసం ప్రాధాన్యం:
కార్తీక మాసం వివాహిత మహిళలకు కూడా అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో స్త్రీలు గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, చీరలు, జాకెట్లు మొదలైన వస్తువులను దానం చేయాలి. వీటిని భక్తితో దానం చేయడం ద్వారా భర్త ఆయుష్షు పెరుగుతుందని, కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుందని నమ్మకం ఉంది.
