
D-News: హ్యుందాయ్ మోటార్ కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి భారత్‌లో 26 కొత్త మోడళ్లను విడుదల చేయడం లేదా ప్రస్తుత మోడళ్లను అప్డేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కొత్త లేదా అప్డేట్ చేసిన వాహనాలను తీసుకురావాలనే కంపెనీ ప్రణాళికలో భారత్‌కు కీలక స్థానం కల్పించింది.
కొత్త ఎలక్ట్రిక్ SUV
భారత్‌లో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని దేశంలోనే డిజైన్, తయారీ చేయనుంది. ఇందులో ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు లెవల్-2 డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ ఉండనుంది. దీనితో పాటు కొత్త మిడ్-సైజ్ ఇంజిన్ SUVని కూడా తీసుకురానుంది.
90 శాతం విడిభాగాలు దేశీయంగానే
భారత్‌లో తయారీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంపై కంపెనీ దృష్టి పెట్టింది. 2030 నాటికి వాహనాల్లో ఉపయోగించే 90 శాతం భాగాలను భారత్‌లోనే సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీకి దేశంలో 1,400కు పైగా స్థానిక సరఫరాదారులు, 900కు పైగా ఇంజినీర్లు ఉన్నారు.
భారత్‌లో ప్రస్తుతం హ్యుందాయ్‌కు ఏడాదికి 11 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. 2030 నాటికి దీనికి మరో 3.2 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని జోడించాలని కంపెనీ ప్రణాళిక వేసింది.
గ్లోబల్ మార్కెట్లకు భారత్ కేంద్రం
భారత్‌ను కేవలం దేశీయ మార్కెట్‌గా కాకుండా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా కూడా హ్యుందాయ్ అభివృద్ధి చేయాలని చూస్తోంది. 2030 నాటికి భారత్‌లో తయారయ్యే వాహనాల్లో 30 శాతం వరకు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 55.5 లక్షల వాహనాల విక్రయాలను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్థానిక తయారీ, ఎగుమతుల విస్తరణతో ఆటోమొబైల్ రంగంలో భారత్‌కు మరింత కీలక పాత్ర కల్పించేందుకు హ్యుందాయ్ సిద్ధమవుతోంది.
